‘భారత్ బలహీనమైన దేశం కాదు’

12 January, 2018 - 4:43 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారత భూభాగంలో దురాక్రమణలకు పాల్పడితే సహించబోదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. చైనా బలమైన దేశం కావోచ్చు. కానీ, భారత్‌ బలహీనమైన దేశం మాత్రం కాదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై భారత్‌ దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చైనా పాల్పడుతున్న సరిహద్దు ఉల్లంఘనలను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని పేర్కొన్నారు. భారత భూభాగాలపై చైనా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే సహించబోమన్నారు. భారత తన పొరుగు దేశాలను దూరం చేసుకోదని, చైనాకు అవి దగ్గర కాకుండా చూసుకుంటున్నదని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా.. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంపై భారత్‌ వేచి చూస్తుందని బిపిన్ రావత్ సమాధానమిచ్చారు. భవిష్యత్‌లో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలంటే అత్యాధునిక టెక్నాలజీ, ఆయుధాలు అవసరమన్నారు. వాటి కోసమే చూస్తున్నామని చెప్పారు. 2017లో దక్షిణ కశ్మీర్‌పై దృష్టి సారించామన్నారు. ఇప్పుడు ఉత్తర కశ్మీర్‌లో ప్రమాదం పొంచి ఉన్న బారాముల్లా, పఠాన్‌, హంద్వారా, కుప్వారా, సోపైర్‌, లోలాబ్‌తో పాటు ఇతర ప్రాంతాల భద్రతపై దృష్టి సారిస్తామని బిపిన్ రావత్ పేర్కొన్నారు.