పాన్ కార్డ్ దరఖాస్తు నిబంధనల్లో సడలింపు?

11 July, 2018 - 11:54 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: తల్లి మాత్రమే ఉన్న పిల్లలకు పాస్‌‌పోర్టు తరహాలోనే పాన్‌ కార్డుకు కూడా నిబంధనలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తండ్రి పేరు నమోదు చేయకుండానే ఒంటరి తల్లుల పిల్లలు పాన్‌ కార్డును దరఖాస్తు చేసుకునేలా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసీడీ) ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్‌ స్వాగతించాయి.

జీ న్యూస్‌ రిపోర్టు ప్రకారం డబ్ల్యూసీడీ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌‌కు లేఖ రాసినట్టు తెలిసింది. విడాకులు తీసుకున్న తల్లులు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల విషయంలో పాన్‌ కార్డులో తండ్రి పేరు తొలిగించే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు. జూలై 6న గోయల్‌‌కు ఈ లేఖ రాశారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, పలు ప్రభుత్వ అథారిటీల ముందు సమర్పించే దరఖాస్తుల్లో వారి మాజీ భర్తల పేర్లను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా అవకాశం కల్పించడం ఎంతో ముఖ్యమని మేనకా గాంధీ చెప్పారు. అంతేకాక తల్లులు దత్తత తీసుకుని పెంచే పిల్లలకు తండ్రి ఉండరని, అలాంటి కేసుల్లో కూడా తండ్రి పేరు అవసరం లేకుండా పాన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మహిళల్లో సాధికారికత కల్పించడానికి దీన్ని ముందస్తుగానే అమలు చేయాల్సి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఇది చాలా ప్రగతిశీలమైనదన్నారు. ప్రస్తుతం ఇది చాలా మంచి నిర్ణయమని శర్మ అభివర్ణించారు. ఓ పురుషుడితో మహిళలు తమను తాము గుర్తింపు పొందాల్సిన అవసరం లేదని, వారికి సాధికారత కల్పించే విషయాన్ని ఎంతగానో స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు.

సీనియర్‌ సీపీఐ లీడర్‌, సామాజిక కార్యకర్త అన్నీ రాజా కూడా ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. పాన్‌ కార్డు పొందడానికి ఇబ్బందులు పడుతున్న చాలా మంది పిల్లలకు ఇది ఎంతో సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్‌ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు నమోదు చేయడం తప్పనిసరి. దీన్నే గుర్తింపు కార్డుగా కూడా భావిస్తున్నారు. తండ్రి పేరు నమోదు చేయడంపై వెసులుబాటు కల్పిస్తే.. ఒంటరి తల్లులు ఎదుర్కొనే చాలా సమస్యలను ఇది పరిష్కరిస్తుందని మహిళా హక్కుల కార్యకర్త మరియం ధవాలే చెప్పారు.