‘వినయ విధేయ రామ’ సినిమా రివ్యూ

11 January, 2019 - 3:05 PM

సినిమా: వినయ విధేయ రామ
జానర్: యాక్షన్ డ్రామా
నటీనటులు: రామ్‌‌చరణ్‌, కియారా అద్వానీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ, ఆర్యన్ రాజేష్‌, మ‌ధుమిత‌, ర‌వివ‌ర్మ, హిమ‌జ‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, మ‌ధునంద‌న్‌, ఈషా గుప్తా (స్పెష‌ల్ సాంగ్‌) త‌దిత‌రులు
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: డీవీవీ దానయ్య
మాట‌లు: ఎం.ర‌త్నం
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర్‌రావు, త‌మ్మిరాజు
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణన్‌
ఛాయాగ్రహ‌ణం: రిషి పంజాబి, ఆర్థర్ ఎ.విల్సన్‌

మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరి కల‌య‌క‌లో సినిమా వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కాంబినేష‌నే రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీనుది. వీరు క‌ల‌సి సినిమా చేస్తున్నార‌ంటేనే అది ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి సర్వత్రా నెల‌కొంది. సినిమా ఫ‌స్ట్ లుక్‌, పోస్టర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇలా అన్నీ ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచాయి.

‘రంగస్థలం’ లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌‌టైనర్‌ వినయ విధేయ రామ. కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. వరుస ప్రయోగాల తరువాత చరణ్‌ కమర్షియల్ ఎంటర్‌‌టైనర్‌‌తో చావటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారనే చెప్పాలి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల శుక్రవారం ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఎంత వరకూ అలరించింది? రామ్‌‌చరణ్‌ తన సక్సెస్‌ ట్రాక్‌‌ను కొనసాగించాడా? బోయపాటి మాస్‌ ఫార్ములా వర్కవుట్‌ అయ్యిందా?కథ‌ :
న‌లుగురు అనాథ పిల్లలు చెత్తకుప్పల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్పడుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్నపిల్లాడి ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న ఆ నలుగురికీ చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి బ్రత‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్లవాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్తా ఐదుగురు అవుతారు.
రామ్ (రామ్‌‌చరణ్‌)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్‌ కుమార్‌ (ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ్. భువన్‌ కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌‌గా వైజాగ్‌‌‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్‌ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ్, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు.

అదే సమయంలో బీహార్‌‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌). రాజు భాయ్‌ తన ప్రాంతంలో ఎలక్షన్‌‌లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్‌ కుమార్‌‌ను అక్కడికి ఎలక్షన్‌ కమిషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్‌, భువన్‌ కుమార్‌‌ను ఏం చేశాడు? రాజు భాయ్ మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ వారంద‌రినీ చంపేస్తాడు. బీహార్ సీఎం (మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌‌తో మాట్లాడటం చూసిన ఎస్పీ భ‌య‌ప‌డి పారిపోతాడు. రామ్‌‌ను క‌లిసేందుకు బీహార్ షీఎం ఎందుకు వ‌చ్చాడు? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే మిగతా కథ.ఎవరెలా చేశారంటే..:
ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్‌ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్‌‌చరణ్‌ ఇందులో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టు అనిపించినా.. రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా కూడా మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్లలో చరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌‌లో ఆమె నటన బాగుంది. విలన్‌‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌‌లకు మించి లేవు.విశ్లేష‌ణ‌:
బోయ‌పాటి శ్రీను సినిమా అంటేనే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్కర్లేదు. అవి రెండూ పుష్కలంగానే ఉన్న సినిమా ‘విన‌య విధేయ రామ‌`. ఈ మొత్తం మూవీలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. యాక్షన్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, బీభ‌త్సాన్ని తెర‌ మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. రామ్‌‌చ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్రతి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. ముఖేష్‌రుషి ఎపిసోడ్ చివ‌రికి ఏమైందో క్లారిటీ లేదు. దేవిశ్రీ పాట‌లు, కెమెరా ప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు ప్లస్ పాయింటే. డైలాగులు బావున్నాయి. `ఉచ్చపోయిస్తా` అని ముఖేష్ రుషి అన్నప్పుడు రామ్‌‌చ‌ర‌ణ్ ప్రవ‌ర్తన బీసీ సెంట‌ర్లకు క‌నెక్ట్ అవుతుంది. రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బలాలు:
రామ్‌‌చరణ్‌
కొన్ని యాక్షన్‌ సీన్లు
నిర్మాణ విలువ‌లు
ఇంట‌ర్వెల్ ఏపిసోడ్‌
మాస్ ఎలిమెంట్స్‌
బలహీనతలు:
మితిమీరిన హింస
ఫోర్స్‌‌డ్‌ సీన్లు
బలం లేని రొటీన్ క‌థ‌
సంగీతం
దర్శకత్వం
ఒక‌ట్రెండు సాంగ్స్ మిన‌హా మిగిలిన పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించేలా లేదు
లాజిక్స్‌‌కు మ‌రీ దూరంగా ఉన్న సినిమా