కశ్మీర్‌ రాళ్లదాడిలో చెన్నై టూరిస్ట్ మృతి

08 May, 2018 - 12:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌‌లో స్కూల్‌ బస్‌‌పై రాళ్ల దాడి ఘటన మరిచిపోక ముందే సోమవారం మరో బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన పర్యాటకుడు మరణించాడు. పలువురు పర్యాటకులు, స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఆర్‌.తిరుమణి (22) గా గుర్తించారు.

సోఫియాన్‌‌లో ఆదివారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో ఐదుగురు హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టడంతో దీనికి వ్యతిరేకంగా వేర్పాటు వాదులు ఆందోళనలకు దిగారు. జాతీయ రహదారిపై ఆందోళన చేసిన నిరసనకారులు ఒక్కసారిగా టూరిస్ట్‌ వాహనాలపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో తిరుమణికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించాడు. ఈ ఘటనపై ఎస్పీ తేజిందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దుండగులపై కేసు నమోదు చేశాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

రాళ్లదాడిలో మరణించిన చెన్నై పర్యాటకుడు తిరుమణి కుంటుంబానికి జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ విషాదకర ఘటన జరిగినందుకు క్షమించాలని తిరుమణి తల్లిదండ్రులను ఆమె కోరారు. తిరుమణి తల్లిదండ్రులను ఆమె ఆస్పత్రిలో పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మెహబూబా మాట్లాడుతూ.. ‘ఈ ఘటన జరిగినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టం. వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు.

కాగా.. రాళ్ల దాడిని ప్రతిపక్షనేత ఓమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. అమాయకులపై రాళ్ల దాడి చేయడం సిగ్గుచేటు అని తెలిపారు. నిరసనకారులు పద్ధతి, వారి ఆలోచనలు సరైనవి కాదన్నారు. ‘తిరుమణి కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.