టెక్కీ మరణశిక్షకు హైకోర్టు సమర్ధన

11 July, 2018 - 12:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ఏడేళ్ళ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఓ టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్‌ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌‌కు మరణ శిక్ష సరైనదే అంటూ తీర్పు వెలువరించింది.

చెన్నై సమీపంలోని ఓ అపార్ట్‌‌‌మెంట్‌‌లో నివాసం ఉంటున్న దశ్వంత్‌.. గత ఏడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశ చూపి ఇంటికి పిలిచి.. అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను గొంతు నులిమి హత్యచేసి, మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌‌గా తీసుకుంది. కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్‌ కోర్టు దశ్వంత్‌‌కు మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది.

ఈ తీర్పును దశ్వంత్ సవాల్ చేస్తూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన హైకోర్టు స్థానిక కోర్టు తీర్పును సమర్ధించింది.

కాగా.. స్థానిక కోర్టులో బాలికపై రేప్, హత్య కేసు విచారణ జరుగుతున్న సమయం గత ఏడాది డిసెంబర్‌‌లో దశ్వంత్‌ బెయిల్‌‌పై బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతడు తన తల్లి సరళను చంపేసి, ఆమె ఆభరణాలతో ముంబై పారిపోయాడు. చివరికి దశ్వంత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై తరలించారు. సరళ హత్య కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది.