ఐపీఎల్ ఫైనల్స్‌కు చెన్నై!

23 May, 2018 - 10:49 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: కీలక మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. ఫైనల్లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో చేతులెత్తేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ గోల్డెన్ డక్‌‌తో మొదలైన వికెట్ల పతనం కొనసాగింది. చివరికి బ్రాత్‌‌వైట్ పుణ్యమా అని గౌరవ ప్రదమైన స్కోరు చేసినా, దానిని కాపాడుకోలేక మ్యాచ్‌‌ను చెన్నైకి సమర్పించుకుంది. ఫలితంగా ఫైనల్లోకి వెళ్లాలంటే రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితికి చేరుకుంది. ఇక హైదరాబాద్‌‌పై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్లోకి ప్రవేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ గోల్డెన్ డక్ అయ్యాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌‌మన్ గోస్వామి- కెప్టెన్ విలియమ్స్‌‌లు ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌‌లో గోస్వామి (12) అవుటయ్యాడు. మరో రెండు పరుగులు జోడించిన తర్వాత విలియమ్సన్ (24) కూడా మైదానం వదిలిపెట్టాడు.

కేవలం 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. చెన్నై బౌలర్ల ముందు బ్యాట్స్‌‌మెన్ నిలబడలేక వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. చివర్లో కార్లోస్ బ్రాత్‌‌వైట్ 29 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు, యూసుఫ్ పఠాన్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 2 వికెట్లు తీయగా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై తొలి ఓవర్ ఐదో బంతికి ఖాతా తెరవకుండానే ఓపెనర్ షేన్ వాట్సన్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద సురేశ్ రైనా (22)ను సిద్ధార్థ్ కౌల్ పెవిలియన్‌కు పంపాడు. ఇలా హైదరాబాద్ బౌలర్లు క్రమంగా పట్టు బిగించారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడి పెంచారు. రాయుడు (0), ధోనీ (9), బ్రావో (7), రవీంద్ర జడేజా (3), దీపక్ చాహర్ (10), హర్భజన్ సింగ్ (2) ఇలా వచ్చి అలా వెళ్లడంతో చెన్నై ఓటమి తప్పదని అందరూ భావించారు. హైదరాబాద్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే.. ఓపెనర్ ఫా డుప్లెసిస్ క్రీజులో పాతుకుపోయి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టును ఫైనల్‌‌కు చేర్చాడు. చివరి మూడు ఓవర్లలో విజయానికి 43 బంతులు అవసరం కాగా, డుప్లెసిస్ రెచ్చిపోయాడు. 4, 6, 4, 4తో చెలరేగిపోయాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆశలు నింపినా చివర్లో తడబడడంతో హైదరాబాద్‌‌కు నిరాశ తప్పలేదు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న సన్‌‌రైజర్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. చెన్నై జట్టును ఫైనల్‌‌కు చేర్చిన డుప్లెసిస్‌‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.