మార్చిలో బాబు బయోపిక్

09 February, 2019 - 6:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ మహానటి గొప్ప విజయం సొంత చేసుకుంది. అలాగే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు ఇటీవలే విడుదల అయింది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించ లేదు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ ద్వితీయ భాగం మహానాయకుడు తర్వాతలోనే విడుదల కానుంది. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రపై తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఈ చిత్రం ఇటీవలే విడుదల అయింది. ఈ చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌ కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పేరే చంద్రోదయం. మోహన్ శ్రీజ సినిమాస్ శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత జి.వి.కె. రాజేంద్ర వెల్లడించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలను ఇతివృతంగా తీసుకుని చంద్రదోయాన్ని మలిచినట్లు చెప్పారు. ఈ చిత్రానికి పి. వెంకటరమణ దర్శకత్వం వహించారు.