అభద్రత… ఆందోళన…!

19 March, 2018 - 2:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకుని, వదిలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయం పలుమార్లు స్పష్టమైంది. తాజాగా కూడా ఆయన తన సహజ ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. 2104 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీలతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. నిజానికి అప్పుడు ఏపీలో టీడీపీ గెలవడానికి గానీ, చంద్రబాబు అధికారంలోకి రావడానికి గానీ సొంత ప్రాబల్యం సరిపోదనేది వాస్తవం. అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీ వల్ల టీడీపీకి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చేయడం విమర్శలకు తావిచ్చింది. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఆయన వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరో పక్కన తన మీద, తన కుమారుడు లోకేశ్ పైన, టీడీపీ నాయకుల అవినీతిపైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం ఎత్తడం ఇప్పుడాయనకు ఎంతమాత్రమూ రుచించడం లేదు. ఆనాడు పవన్ కల్యాణ్ పిలుపుతో కనీసం 3 శాతం ఓట్లు లబ్ఢి పొంది, అధికార పీఠం ఎక్కి, ఇప్పుడు ఆయన పైనే విమర్శల దాడికి తెగబడుతుండడం గమనార్హం. అలా తనకు మెజారిటీ ఓట్లు, అధికారాన్ని సాధించిపెట్టిన పవన్ కల్యాణ్‌పై ఏమాత్రం ఆలోచన లేకుండా విమర్శల దాడి చేస్తుండడం సమంజసం కాదనేది రాజకీయ పండితులు భావనగా ఉంది.

తనకు ప్రయోజనం కలుగుతుందంటే ఎలాంటి వారినైనా ఎంతకైనా దిగజారి సాయం ఆర్థించడం, అవసరం తీరాక వారిని పక్కన పెట్టేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కదా అనేది విశ్లేషకులు చెప్పే మాట. గతంలో పిల్లనిచ్చిన మామ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం ఉండనే ఉంది. అక్కడితో ఆగకుండా అంతటి మహానుభావుడిపైనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పులు వేసి, అవమానించడం వెనుక చంద్రబాబు ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాగేసుకోవడమే కాకుండా… ఆయన మరణానికి కూడా పరోక్షంగా బాబుగారే కారణం అనే విమర్శ ఉంది. అప్పుడలా ఎన్టీఆర్‌ని అవమానించిన బాబు ఆయన ఫొటో పెట్టుకుని ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారనే పొలిటికల్ కామెంట్లకూ కొదవలేదు.

జనసేనాని చలవతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు ఇప్పుడు పవన్ కల్యాణ్‌పైన ఎదురుదాడికి దిగుతుండడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది. నాలుగేళ్ళుగా తనను వేలెత్తి చూపని పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు యూ టర్న్ తీసుకున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా మారుతోంది. అసలు పవన్ కల్యాణ్ విమర్శల వెనుక ఎవరిదో కుట్ర ఉందంటూ బాబు రంకెలు వేస్తుండడం ఆయనలో గూడుకట్టుకున్న అభద్రతాభావాన్ని వెల్లడిస్తోందంటున్నారు. తనకు ఉపయోగం ఉన్నంతకాలమూ ముసిముసి నవ్వులు నవ్వుకుని ఆనక అది కాస్తా తీరాక ఎంతటి వ్యక్తిత్వ హననానికైనా చంద్రబాబు తెగిస్తారనేది మరోసారి బహిర్గతం అవుతోందటున్నారు రాజకీయ విశ్లేషకులు.