‘జగన్‌కి అసలు విషయంపై అవగాహన లేదు’

11 July, 2019 - 7:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ప్రతిపక్షాల మనోభావాలు దెబ్బతీసి… కించపరచాలని చూస్తున్నారంటూ అధికార పక్షం వైయస్ఆర్ సీపీ నేతలుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. అహంభావంతో రాజకీయ ఉగ్రవాదం తయారు చేస్తున్నారని ఆ పార్టీ నేతలపై చంద్రబాబు విమర్శలు సంధించారు. గురువారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి.

ఈ సందర్భంగా అసెంబ్లీలో కరవుపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2016 మార్చిలో రీఎంబర్స్ ‌మెంట్ జరిగినట్లు ఎస్ఎల్బీసీ ఉందన్నారు. 40 రోజుల్లో సీఎం అయిన వ్యక్తికి నేర్చుకోవాలనే తపన ఉండాలని వైయస్ జగన్‌కి చురకలంటించారు. ఇన్ని ఆధారాలుంటే తనని రాజీనామా చేయాలంటున్నారని వైయస్ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు.

రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు పూర్తి వడ్డీ రాయితీ అని చెప్పామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వడ్డీ రాయితీ అసలు ఇవ్వనే లేదని సీఎం జగన్ చెబుతున్నారన్నారు. గతంలోనూ వడ్డీ రాయితీ ఇచ్చారని తమ పార్టీ ఎమ్మెల్యే ఎన్ రామానాయుడు సభలో చెప్పారని చంద్రబాబు తెలిపారు.

సభలో ప్రతిపక్షాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. కరవుపై చర్చలో అసత్యాలపై వైయస్ జగన్ సవాల్ చేశారన్నారు. వడ్డీలేని రుణాలు మంజూరు చేసిన ఆధారాలను ఈ సందర్భంగా చంద్రబాబు సభలో చూపించారు. 2014కు ముందు బకాయి ఉన్న డబ్బులు కూడా చెల్లించామన్నారు. 2013 నుంచి 2019 వరకు పావలా వడ్డీ కింద రూ. 25.14 కోట్లు చెల్లించామని చంద్రబాబు తెలిపారు. సున్నా వడ్డీ కింద రూ. 75 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. అయితే 2017 – 18 నాటికి రూ. 500 కోట్లు పెండింగ్ ఉందన్నారు. సీఎం జగన్‌కి అసలు విషయంపై అవగాహన లేదంటూ చంద్రబాబు చరుకలంటించారు.