‘ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’

13 August, 2019 - 5:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైయస్ జగన్ ప్రభుత్వం మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని అనుకున్నానని… కానీ ఈ ప్రభుత్వం విధ్వంసకంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు.

విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైయస్ జగన్ పులివెందుల పంచాయతీలు రాష్ట్రంలో చేయనివ్వమని ఆయన క్లారిటీగా చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారంటూ వైయస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

గతంలో తమ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తే నాటి ప్రతిపక్షం వైయస్ఆర్ సీనీ నేతలు ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధిక ధరకు ఇసుకను అమ్ముతున్నారన్నారు. ఇసుక దోపిడి ఎవరు చేస్తున్నారో? దీన్ని బట్టే అర్థమవుతుందని చంద్రబాబు తెలిపారు.

పేదవాడికి రూ. 5కు అన్నం పెట్టే అన్న కాంటీన్లు మూసివేయడం దారుణమన్నారు. అనేక సంక్షేమ పథకాలను సైతం రద్దు చేశారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్నిటిపైనా పోరాట కార్యాచరణ రూపొందించుకుందామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు. బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైయస్ఆర్ సీపీ దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అలాగే స్పీకర్ పదవి హుందాతనాన్ని కాపాడుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేతి సీతారాంకు చంద్రబాబు సూచించారు. మంచి నిర్ణయాలను తాము ఎల్లప్పుడు ప్రోత్సహిస్తామని.. అందులోభాగంగానే 370 రద్దుకు మద్దతు పలికామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.