వైఎస్ జగన్‌కు చంద్రబాబు బంపర్ ఆఫర్

11 February, 2019 - 5:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డితో అయినా కలసి నడిచేందుకు సిద్ధమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫిబ్రవరి 11న దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేశారు.

ఈ సందర్భంగా వేదికపై ఉన్న చంద్రబాబును ఓ మీడియా ప్రతినిధి.. చంద్రబాబును ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంపై పోరాటానికి వైయస్ జగన్‌ను ఆహ్వానిస్తారా ? అంటే ఆయన వస్తే.. ఆహ్వానిస్తానని బాబు స్పష్టంగా చెప్పారు. దీంతో అవాక్కయిన ఆ మీడియా ప్రతినిధి మరోసారి .. ఇదే విషయాన్ని మళ్లీ గుచ్చి గుచ్చి అడిగారు.

దీంతో దేశం క్షేమం కోరే వారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానని ‌చంద్రబాబు చెప్పారు. అంతేకాదు. ఎన్నికల ముందు ఇలా కలుస్తారా ? అంటే అందులో తప్పు ఏముంది. ఎన్నిక ముందు అయినా ఎన్నికల తర్వాత అయినా … అందుకోసం ఒక్కటి రెండు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు అయినా తాను రెడీ అని చంద్రబాబు చెప్పారు. అలాగే వైయస్ జగన్‌ని ఇలా ఆహ్వానించడంలో తప్పు లేదని కూడా చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై కొంతమంది నెట్‌జన్ల సెటైర్లు పేలుస్తుండగా.. మరికొంత మంది అయితే చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరుగుతు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… భవిష్యత్తులో టీడీపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నా మనం అశ్చర్యపోవక్కర్లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో చేసిన ఈ కామెంట్‌తో పవన్ జోస్యం ఫలిస్తుందని నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల గుంటూరులో ప్రధాని మోదీ ప్రజా చైతన్య సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సీఎం చంద్రబాబుపై గుప్పించిన విమర్శలు ఈ కామెంట్ ద్వారా నిజం అవుతున్నాయంటూ నెటిజన్లు సెటైర్లు పెడుతున్నారు.

మరికొందరైతే… కేంద్రంతో పోరాటం కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమతో కలవాలంటూ తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో పలు ధర్మపోరాట దీక్షల్లో సైతం పవన్ కలసి రావాలంటూ చంద్రబాబు పిలుపు నిచ్చారు.

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కూడా పవన్ మాతోనే ఉన్నాడంటూ కామెంట్ చేశారు. దీనిపై పవన్ అప్పటి కప్పుడు స్పందించి.. తాను ఎన్నికల్లో పోటీ చేసినా.. ప్రజాసమస్యలపై పోరాటం చేసినా అదీ ఒక్క వామపక్షాలతోనే అంటూ విశాఖ జిల్లా పాడేరు బహిరంగ సభ ద్వారా క్లారిటీగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు అండ్ కో కి పవన్‌ అంశాన్ని పక్కన పెట్టారు.

ఇక మిగిలింది.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్రంతో పోరాటానికి కలసి రావాలంటూ మిగిలిన ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. పోరాటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ రాను అన్నాడని ఇక వైయస్ జగన్‌ను చంద్రబాబు ఆహ్వానించారని సోషల్ మీడియాలో సెటైర్లు పెడుతున్నారు.