‘దేనికైనా తెగిస్తారు’

15 April, 2019 - 3:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: నేరస్థులకు ప్రధాని మోదీ చౌకీదారుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు ఆరోపించారు. సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… దేశంలోని వ్యవస్థలన్నీంటిని మోదీ సర్వ నాశనం చేశారని నిప్పులు చెరిగారు. సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అభూత కల్పనలు సృష్టించారని మండిపడ్డారు.

సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో విమర్శలు చేస్తే తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌కు ఉత్తమ ప్రధాని మోదీ అంటూ పాక్ ప్రధాని కితాబిచ్చారు.. ఇప్పుడు కుమ్మక్కైంది ఏవరు అని బీజేపీ నేతలకు చంద్రబాబు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై మోదీ ఏం చెబుతారని ప్రశ్నించారు.

ఫారం 7 విషయంలో తప్పుడు ఫిర్యాదులు ఇస్తే ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు. ఏ ఐపీ అడ్రస్సుల నుంచి తప్పుడు ఫిర్యాదులు చేశారో ఎందుకు బయటపెట్టట్లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రఫేల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినవారు దేనికైనా తెగిస్తారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

2018 డిసెంబర్‌లో మెయింటెనెన్స్ కోసం బెల్ కంపెనీ ఈవీఎంలను వెనక్కు రప్పించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఈవీఎంల మెయింటెనెన్స్ కోసం పని చేసిన ఇంజినీర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదిన ప్రశ్నించారు. ఈవీఎంల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈవీఎంల లెక్కింపుతో పాటు వీవీ ప్యాట్ల లెక్కింపును సరి చేయాలని ఈసీకి చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ఎందుకు తెచ్చారు.. మళ్లీ రూ. 2 వేల నోట్లు తెచ్చారని ప్రశ్నించారు. 2014 నాటి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రంలో ఆఖరి విడతలో ఎన్నికలు నిర్వహించారని .. ఈ సారి మాత్రం మొదటి విడతలోనే నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఈవీఎంలలో సాంకేతికలోపం వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది ఉండరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈవీఎం ఉదయం మరమ్మతుకు గురైందంటే మధ్యాహ్నానికి సరి చేస్తారా అని ప్రశ్నించారు. ఈవీఎంల వ్యవహారం సరైందని అనుకోగానే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. సంయమనంతో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించానని చంద్రబాబు చెప్పారు.

చాలా దేశాలు ఈవీఎంలు వద్దని బ్యాలెట్ పద్దతికే మొగ్గు చూపాయిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 7 లక్షల 50 వేల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారు.

కానీ సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామని చంద్రబాబు తెలిపారు. అయినా ఐపీ అడ్రస్సులు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారంటూ మోదీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

అలాగే ఓట్ల దొంగలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మనం ఎవరికీ ఓటు వేశామో 7 సెకన్ల పాటు చూపించాల్సి ఉంటే… 3 సెకన్లు చూపించారన్నారు. ఈవీఎంలు మరమ్మతుకు గురైతే పట్టించుకోరని మండిపడ్డారు. సరైన శిక్షణ ఇవ్వకుండా సిబ్బందిని ఏర్పాటు చేస్తారా అని ఈసీని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.