‘మద్యం ధరలు పెంచింది అందుకే’

14 October, 2019 - 7:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: వైయస్ జగన్ పరిపాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సోమవారం నెల్లూరులో అనిల్ గార్డెన్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు .. పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికీ జమీన్ రైతు ఎడిటర్‌పై కూడా అధికార వైయస్ఆర్ సీపీ నాయకులు దాడి చేశారని గుర్తు చేశారు. తన ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన వారికి ప్రమోషన్ ఇచ్చారని చంద్రబాబు వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే అధికారం శాశ్వతం కాదని .. తప్పు చేసిన అధికారులకు శిక్షలు తప్పవని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.

ఈ పాలనలో సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. ముడుపుల కోసమే మద్యం ధరలు పెంచారని వైయస్ జగన్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని గతంలో వైయస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రగల్భాలు పలికారని.. కానీ ఇప్పుడు రూ. 6, 500 మాత్రమే ఇస్తామంటున్నారన్ని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్బంగా సీఎం వైయస్ జగన్‌కి చంద్రబాబు సూచించారు. నిర్వహణ లేక గ్రామాలు, పట్టణాల్లోని వీధి దీపాలు వెలగడం లేదన్నారు. టీడీపీ నిర్మించిన శ్మశాన వాటికలు, మంచి నీటి ట్యాంకులకు సైతం వైయస్ఆర్ సీపీ రంగులు వేస్తున్నారన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.