నవ్విపోదురు గాక.. నాకేటి లెక్క..!

10 April, 2019 - 4:41 PM

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. తొలి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఇతర రాష్ట్రాల్లోని తొలివిడత పోలింగ్ జరిగే చోట్ల గానీ నాయకులెవరూ బయట కనిపించడంలేదు. అయినప్పటికీ ఆయనొక్కరు మాత్రం బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు పేరుతో.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆపైన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నెపంతో ఇంచు మించు రెండు మూడు గంటల పాటు హల్చల్ చేశారు.

ఇంతలా హల్చల్ చేస్తూ.. పబ్లిక్‌కు పబ్లిక్‌గా కనిపించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ‘నవ్విపోదురు గాక.. నాకేటి లెక్క’ చందంగా చంద్రబాబు వ్యవహరించడం పలువురిని విస్మయానికి గురిచేసిందనడంలో సందేహం లేదు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అయితే.. ఆ వెంటనే విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా.. పోలింగ్‌కు ముందు రోజు భారీ డ్రామాకు తెరతీశారంటూ మండిపడింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారంటూ ఎద్దేవా చేయడం గమనార్హం.

ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ.. జనం కళ్ళకు కనిపిస్తూ ఉండాలనే ఆయన ఆశయం ఈ హల్చల్ ద్వారా నెరవేర్చుకున్నట్లయిందనే చెప్పొచ్చు. రాజకీయ చతురుడైన చంద్రబాబు తాను ఏది చేసినా తద్వారా రాజకీయంగా లాభం ఎంత? వచ్చే ప్రయోజనం ఎంతనే బేరీజు వేసుకోవడంలో దిట్టనే చెప్పక తప్పదు. అందుకే మిగతా నాయకులంతా ఎన్నికల నిబంధనల వేళ బయటికి కనిపించకపోయినా ఆయన మాత్రం ఎన్నికల సంఘంపై ఫిర్యాదు పేరుతో కొంత హడావుడి చేయడం గమనార్హం. ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా ధర్నాకు దిగడం విశేషం.ఈసీ చర్యలను వ్యతిరేకిస్తూన్నానంటూ ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సెక్రటేరియట్‌‌లోని ఐదో నెంబర్ బ్లాక్ వద్ద చంద్రబాబు తన పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగడం చెప్పుకుని తీరాల్సిందే. ఈసీ వైఖరిని వ్యతిరేకించే నెపంతో చంద్రబాబు నిరసన ప్రదర్శన చేయబోతున్నట్టు ఆయన అనుకూల మీడియా ముందే ఉదయం నుంచీ బాకా ఊదేయడం గమనార్హం.
చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి.. ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత ఈసీ తీరుపైన, ప్రత్యర్థి పార్టీపైన ఆయన విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఈవీఎంలపై అనుమానాలున్నాయని మరోమారు ఆయన నిరసన వ్యక్తం చేయడం విశేషం.

మీడియాతో అరగంటకు పైగా మాట్లాడిన చంద్రబాబు.. తరువాత తన నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం మెట్లపై టీడీపీ నేతలతో కలిసి కూర్చుని నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిరసన వ్యక్తం చేసి, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారనడంలో సందేహం ఉండబోదని చెప్పొచ్చు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చంద్రబాబు ఇదంతా చేసినా.. దాని వెనుక బలీయమైన భయం ఉండి ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. ఐదేళ్ళ తన పాలనలో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు అంతకు ముందే ఆయనకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. ఆ క్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను కటువుగానే విమర్శిస్తూ.. ఒకింత అసహనానికి గురవుతూ ప్రసంగించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.

– డి.వి.రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్టు