పవన్ చెప్పినంత… మోదీ ఇవ్వాలి

12 January, 2019 - 7:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: కేంద్రప్రభుత్వం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్కగట్టారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సదరు ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శనివారం అమరావతి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… బీజేపీ బాధ్యత నుంచి తప్పుకున్నందునే విడిపోయామని చంద్రబాబు వెల్లడించారు.

విభజనతో ఆదాయం కోల్పోయిన రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలేవి పట్టించుకోకుండా వదిలేశారని మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ కోడి కత్తి దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎయిర్ పోర్టులో దాడి జరిగిన వెంటనే వైయస్ జగన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని… అలాంటి బాధ్యత లేని వ్యక్తి వైయస్ జగన్ అని చంద్రబాబు అన్నారు. దీనిపై ఎన్‌ఐఏ దర్యాప్తు ఏమిటని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టు కేంద్రం ప్రభుత్వం సంస్థ కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) అధీనంలో ఉంటుందని గుర్తు చేశారు. ఈ కేసు.. అటు సీఐఎస్ఎఫ్, ఇటు రాష్ట్ర పోలీసులు పర్యవేక్షించాలని చంద్రాబాబు అభిప్రాపడ్డారు.

అలాగే ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ సహకారం అందించలేదన్నారు. ఒకే రోజు రెండు పెద్ద సంస్థలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయన్నారు. ఇంత చేస్తుంటే మోదీ, కేసీఆర్, జగన్ కలిసి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ. 3 వేల కోట్లు ఇంకా రావాలని అన్నారు. రైతు రుణమాఫీ, పింఛన్లు ఇచ్చామని ఏపీకి రావాల్సిన లోటును కేంద్రం కత్తిరించిందన్నారు.

అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. జన్మభూమిలో 5. 60 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ ఫిర్యాదుల్లో 33 వేలకు పైగా రియల్ టైమ్‌లో పరిష్కరించారని వివరించారు. అయితే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను భూదార్ ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రెండు చేతులు లేని వారికి నెలకు రూ. 10 వేలు పింఛను ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.