ఏపీ ప్రజలకు బాబు హెచ్చరిక

17 March, 2019 - 6:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కాకినాడ: రాష్ట్రంలోకి ఓటు దొంగలు చొరపడ్డారు.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ ఏపీకి 9 లక్షల ఫారం – 7 దరఖాస్తులు ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ముఖ్యకేంద్రం కాకినాడలో చంద్రబాబు ఎన్నిక ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడానికి వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న కేసీఆర్‌తో వైయస్ జగన్ లాలూచీ పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

వైయస్ జగన్ చిన్నాన్నా… మాజీ మంత్రి వైయస్ వివేకానందకు గుండెపోటు వచ్చిందని తొలుత చిత్రీకరించారని ఆ తర్వాత ఆయన హత్య జరిగిన స్థలంలో సాక్ష్యాలు కడిగేశారని.. ఆధారాలు చెరిపేశారని ఆరోపించారు చంద్రబాబు. డిటెక్టివ్ నవలలో కూడా ఇలాంటి దారుణాలు చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. మానవత్వం లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారన్నారు.

మంచి వాళ్లకు మారు పేరు తూర్పు గోదావరి జిల్లా అని చంద్రబాబు అభివర్ణించారు. అలాంటి ప్రశాంతమైన జిల్లాలో పులివెందుల రాజకీయాలు వద్దని ప్రజలకు చంద్రబాబు హితవు పలికారు. వైయస్ జగన్ లోటస్ పాండ్‌లో ఉంటేనే మనకు ప్రశాంతత ఉంటుందన్నారు.

చనిపోయిన వాళ్ల వద్ద కూడా మరణ వాంగ్మూలం ఇప్పించే ఘనులు వీళ్లు అంటూ వైయస్ఆర్ సీపీ నాయకులపై చంద్రబాబు ధ్వజమేత్తారు. మా రాష్ట్ర ఆస్తులు ఎందుకు పంచలేదో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా చెప్పాలని కేసీఆర్‌ను ఈ సభ ద్వారా సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో 150 ప్లస్ అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో టీడీపీనే గెలవాలి చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌తో లాలూచీపడి ఏపీకి ద్రోహం చేసే పార్టీలు మనకు కావాలా అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు ఈ సందర్బంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

టీడీపీ కార్యకర్తల కోసం నిత్యం 4 గంటలు కష్టపడతానని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 19 అసెంబ్లీ స్థానాలను టీడీపీకే కట్టబెట్టాలని ప్రజలుకు బాబు విజ్ఞప్తి చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి కూడా పంపామని చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయినా వైయస్ఆర్ సీపీకి కాపులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.