ఈ ‘శ్రీమంతుడు’ ఏమిచ్చాడో..?

07 April, 2018 - 3:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించి మోసం చేస్తే… ఎన్డీఏ ప్రభుత్వం విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాను కూడా తుంగలో తొక్కి అన్యాయం చేసిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదనను ప్రజలకు చెప్పుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ‘విభజించిన వాళ్లు కుళ్లుకునేలా మనం అభివృద్ధి చెందాలి. అందుకు కసితో పనిచేయాల’ని ఆయన తరచూ పిలుపు ఇస్తారు.

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ కోసం త్యాగాలు చేయాలంటూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసే విజ్ఞప్తులకు స్పందించి పలువురు నగదు, బంగారం రూపేణ రాజధాని నిర్మాణం కోసం విరాళాలిచ్చారు. రాజధాని ప్రాంత రైతులైతే ఏటా మూడు పంటలు పండే తమ సారవంతమైన 33 వేల ఎకరాల భూముల్నే ఏకంగా ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు.

అంతే కాకుండా రాజధానికి ఇటుకలు విరాళంగా అందజేయాలంటూ చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా ‘మై బ్రిక్- మై అమరావతి’ అనే ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశారు. దీనికీ దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువలా వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకూ ఆ విరాళాలు ఎంత వచ్చాయనేది మాత్రం మిస్టరీయే.

తాజాగా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి ‘మీరు నగదు బ్యాంకుల్లో పెట్టకండి… మా ప్రభుత్వానికి ఇవ్వండి… దానికి బాండ్లు జారీ చేస్తాం. అంతేకాదు బ్యాంక్ కంటే అధిక వడ్డీ ఇస్తామ’ని ప్రకటించారు. దీంతో తెలుగు ప్రజలు ఔరా అంటూ… ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంతకీ… నాయకుడు అనే వాడు ముందు ఆచరించి చూపిస్తే.. ఆ తర్వాత ప్రజలు ఆయన అడుగుజాడల్లో వెళతారన్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి తన జేబు నుంచి ఇప్పటి వరకు ఎంత ఇచ్చారనేది మాత్రం సస్పెన్సే! పోనీ త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ లాగా నిరుపేదా అంటే అదీ కాదు. దేశంలోని 29 మంది సీఎంలో అత్యధిక సంపన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని రెండు నెలల క్రితం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది.

దేశంలో శ్రీమంత సీఎంలందరి కంటే శ్రీమంతుడుగా ఉన్న చంద్రబాబు మాత్రం రాజధానికీ పైసా కూడా విధల్చలేదనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీకాక… హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌లోని కొత్త ఇంటిని ఇంద్రభవనంలా నిర్మించుకున్నారు. ఆయనకు చెందిన హెరిటేజ్ సంస్థ ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే బాబుగారి ఆస్తులు కొండవీటి చాంతాడంత ఉన్నాయని ఇప్పటికే పలు ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి.

మరి చంద్రబాబు ఎందుకు రాజధానికి తన వంతు విరాళం ఇదీ అని ఇంత వరకూ ప్రకటన చేయకపోవడం ఏమిటనే దానిపై తెలుగు ప్రజలు పలు రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు.