చంద్రబాబు నాయుడు గృహ నిర్బంధం

11 September, 2019 - 6:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పల్నాడులోని ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చలో ఆత్మకూరుకు వెళ్ళకుండా చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారానికి తాడు కట్టేసిన పోలీసులు, వాహనాలు బయటకు వెళ్లనివ్వకుండా భారీగా మొహరించారు. చంద్రబాబు నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఉండవల్లి ప్రాంతంలో 144 సెక్షన్ విధించామని, అందువల్ల ఇంటి నుంచి బయటకు రావద్దని నోటీసులో స్పష్టం చేశారు. పల్నాడులో 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు.అయితే.. అంతకు ముందు.. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘చలో ఆత్మకూరు’ చేపట్టి తీరుతామని ప్రకటించారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసన తెలపాలని కోరారు. గృహనిర్బంధాలతో తనను, టీడీపీ నేతలను అడ్డుకోవడం పిరికిచర్య అని విమర్శించారు. జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసంలో ఉన్న బాధితులకు ఆహారం అందకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నిర్దయకు నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటిరోజు అని చంద్రబాబు అభివర్ణించారు. ఇలాంటి ఫాసిస్ట్ పాలనను తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రం రావణకాష్టంలా మారిందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని, తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, పౌరహక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో చూస్తానన్నారు.చలో ఆత్మకూరు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును చిలకలూరిపేటలో, గద్దె రామ్మోహన్‌రావు, దేవినిని ఉమా మహేశ్వరరావు, శిద్దా రాఘవరావు, అశోక్‌రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. ఆత్మకూరు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న కొందరు కృష్ణాజిల్లా టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నూజివీడు పీఎస్‌కు తరలించారు. పల్నాడులోని పలువురు టీడీపీ నేతలను బైండోవర్ చేశారు. విజయవాడలోని నోవాటెల్ హొటల్‌లో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు నివాసం వద్ద అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడలో గృహనిర్బంధం చేశారు.పల్నాడులో పూర్తిగా, గుంటూరులోని టీడీపీ ఆఫీస్ పరిసరాల్లోనూ వైఎస్సార్సీపీ బాధితుల పునరావాస శిబిరం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. పిడుగురాళ్ళలో డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. దుర్గిలో రెండు పోలీసు బెటాలియన్లను అందుబాటులో ఉంచారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీసు డివిజన్లలో 144వ సెక్షన్ విధించి ఎక్కడా జనం గుంపులు గుంపులుగా ఉండకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.