నదుల ఊసెత్తే అర్హత బాబుకు లేదు

13 September, 2017 - 3:34 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

విజయవాడ: నదుల గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబే కదా కృష్ణానది ఎండిపోవటానికి కారణం అని ఆయన ప్రశ్నించారు. కృష్ణానదికి నీరు రాకుండా చేసి, పట్టిసీమ ద్వారా నీళ్ళిస్తున్నాం అంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.

చంద్రబాబుకి సంబంధించిన వారికి ప్రాజెక్టుల ప్రణాళికా వ్యయం పెంచుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్ చేశారు. మొత్తం అవినీతి, అక్రమాలతోనే చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెట్టారని మీరు ఇంటింటికీ తెలుగు దేశం ద్వారా ప్రజల్లోకి వెళ్లారని వెల్లంపల్లి నిలదీశారు.

నంద్యాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో పరిపాలన మొత్తం కుంటుపడిపోయి, సెక్రటేరియట్ వెలవెలా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు దుమ్మెత్తిపోశారు. ఆ ఎన్నికల సమయంలో మంత్రులంతా నంద్యాల వెళ్ళిపోయి అభివృద్ధిని పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో లెక్క లేనన్ని ఫైళ్ళు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. సెక్రటేరియట్‌లో ఎన్ని ఫైళ్ళు పెండింగ్‌లో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారని, మనం అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం ఆయన మాటలతో కలుగుతోందన్నారు. నదుల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే మాట్లాడకుండా ఉన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

బాబేమో రాజకీయ పార్టీల అక్కర్లేదంటుంటే ఆయన కొడుకు లోకేశ్ మాత్రం 175 స్థానాల్లోనూ తామే గెలుస్తామంటున్నారని, అసలు ఆ తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావటం లేదన్నారు. అన్నింటికీ కొబ్బరి కాయలు కొడుతున్నారు తప్ప ప్రాజెక్టులు పట్టాలెక్కటం లేదని విష్ణు ఎద్దేవా చేశారు.

ఏపీలో మరో రాజకీయ పార్టీ ఉండకూడదని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ స్పందించాలని మల్లాడి విష్ణు డిమాండ్ చేశారు.