చంద్రబాబు… సన్నాయి నొక్కులు…!

16 April, 2018 - 3:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయి… ఇలా కళ్లు మూసుకుంటే… అలా మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. విభజన హామీలు… ప్రత్యేక హోదా అమలుపై మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ద్వారా చంద్రబాబుకు పూర్తిగా అవగతమైంది. దీంతో కమలనాథులతో రాం రాం అని వారితో ఉన్న బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని టీడీపీ తప్పించి మిగిలిన పార్టీలు గాఢంగా విశ్వసిస్తున్నాయి. కానీ హామీల అమలులో మోదీ ప్రభుత్వ వైఖరికీ నిరసనగా జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు ఏప్రిల్ 16న బంద్‌‌కు పిలునిచ్చాయి. ఈ బంద్ విజయవంతం కావడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నివాసంలో సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.

ఈ బంద్ వల్ల మనమే నష్టపోతున్నాం. ఒక్క రోజు బంద్ కారణంగా ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వచ్చిందంటూ బాధపడిపోయారు. బంద్ వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ బంద్ ఎందుకు? చందద్రబాబు ఈ విధంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమైనా చేస్తే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని ఆయన సెలవిస్తున్నారు.

మరి చంద్రబాబు జన్మదినం ఏప్రిల్ 20వ తేదీ. ఆ రోజు ఆయన నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అదీ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా చేస్తున్నారట. అలాగే.. ఈ నెల 30న తిరుపతిలో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేస్తామని వెంకన్న సాక్షిగా మోదీ ప్రకటించారు. దీనిని గుర్తు చేసేందుకు చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. మరీ చంద్రబాబు చేస్తున్న ‘కార్యక్రమం’ మోదీ ప్రభుత్వానికి తెలుస్తుందా? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కొసమెరుపు ఏమిటంటే… ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఈ సమన్వయ కమిటీ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సూచించడం ఇక్కడ కొసమెరుపు. చంద్రబాబు వ్యవహారమంతా ఎన్నికల స్టంట్‌‌లో భాగమని ఇప్పటికే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.