దక్షిణాది సొమ్ములతో ఉత్తరాదికి సోకులా..!?

13 March, 2018 - 12:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: దక్షిణ భారత రాష్ట్రాలు కడుతున్న పన్నుల సొమ్ముతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. ‘మీరు అభివృద్ధి చెందుతున్నారు.. కానీ ఏపీకి సహాయం చేయకపోవడం సరికాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రానికి దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో ఎక్కువగా డబ్బు వెళుతోందని చంద్రబాబు తెలిపారు. అయితే కేంద్రం మాత్రం ఆ డబ్బును ఉత్తర భారతదేశానికే అధికంగా ఖర్చు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌ లాగే చేయడం మంచిది కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 18 హామీలను అమలు చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ‘హక్కుల కోసం పోరాడతాం. రాజీ పడేది లేదు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ సాధించేదాకా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఎంతవరకైనా వెళతాం’ అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తూర్పారపట్టారు.

‘సెంటిమెంట్‌‌తో నిధులు రావు’ అన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపైనా చంద్రబాబు రుసరుసలాడారు. ‘ఏం.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఇచ్చితీరాల్సిందే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ ప్రకటించారని, అందుకే కేంద్రం నుంచి వైదొలగామని చంద్రబాబు పేర్కొన్నారు. తమ నాయకుడు ఎన్టీ రామారావు ఆంధ్రులకు ఆత్మగౌరవమిస్తే, తాను ఆత్మ విశ్వాసం ఇస్తున్నట్లు చెప్పారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారని, అలాంటప్పుడు ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరంటూ కేంద్రాన్ని చంద్రబాబు నిలదీశారు. చట్టాలను కేంద్రం గౌరవించాలి, హామీలను నిలబెట్టుకోవాలని బాబు సూచించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి మీరే వెక్కిరిస్తే ఎలా? అని బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.

ఏపీలో జాతీయ రహదారులు వేస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. కానీ… అవన్నీ పీపీపీ పద్ధతిలో వస్తున్నవేనని ఆయన ఎందుకు చెప్పరు? అని బాబు ప్రశ్నించారు. విభజన చట్టంలోని లోపాల వల్ల ఎంతో నష్టపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి రావాల్సిన ఆదాయం కూడా తెలంగాణకు వెళ్తోందని, కృష్ణపట్నం పోర్టు వల్ల కూడా ఆదాయం కోల్పోతున్నాం అని పేర్కొన్నారు.

‘కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను బతికించింది’ అని తిరుపతి సభలో మోదీ వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆ తల్లిని కాపాడాలనే తాము విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబునాయుడు చెప్పారు. అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నామని, అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని, తెలుగు వారి సత్తా ఏమిటో నిరూపిస్తామని బాబు అన్నారు.