ఆ అబద్ధమే అతడ్ని పట్టించింది..!

13 September, 2017 - 7:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఎంతటి తెలివైన నేరస్తుడైనా ఎక్కడో ఒక చోట తనకు తెలియకుండా ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టేస్తాడనేది పోలీసు వర్గాల్లో ఉండే బలమైన నమ్మకం. అందుకే పోలీసులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ పరిసరాల్లో ఆధారాలేవైనా దొరుకుతాయేమో అని చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. అలాంటిది ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్‌ను హతమార్చిన ఆమె మైనర్ స్నేహితుడు సాయి కిరణ్ రెడ్డి కూడా అలాంటి బలమైన ఆధారాన్నే పోలీసులకు ఇచ్చేశాడు. అదేంటంటే.. ఒక అబద్ధం..! ఆ అబద్ధమే సాయి కిరణ్ రెడ్డిని పట్టించింది.

చాందిని హత్యకు గురైన రోజు ఎక్కడున్నావని సాయి కిరణ్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను క్రికెట్ ఆడుతున్నానని చెప్పాడు. చాందినీ జైన్ కాల్ డేటా వివరాలతో పాటు, స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రశ్నించారు. ఆ క్రమంలోనే సాయి కిరణ్ రెడ్డిని కూడా ప్రశ్నించినప్పుడు క్రికెట్ ఆడుతున్నానని అబద్ధం చెప్పాడు. అలా చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే.. సాయి కిరణ్ రెడ్డి ఆ సమయంలో క్రికెట్ ఆడలేదని, అసలు అతనికి క్రికెట్ ఆడే అలవాటే లేదని పోలీసు విచారణలో తేలింది.

హైదరాబాద్ మదీనాగూడలోని చాందినీ జైన్‌ను ఆమె స్కూల్ మేట్ సాయి కిరణ్ రెడ్డి పక్కా ప్రణాళికతోనే చంపేశాడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్ రెడ్డిని బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

చాందినిది కేవలం హత్య మాత్రమే అని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తేల్చారని సందీప్ శాండిల్య తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన సమయానికి ముందే చాందిని హత్యకు గురైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించినట్లు సీపీ చెప్పారు. సీసీ ఫుటేజ్‌‌ను చాందిని తండ్రితో పాటు సాయికిరణ్‌ తండ్రికి కూడా చూపించామన్నారు. ఫుటేజ్‌ చూపిన తర్వాత నిందితుడి తండ్రి ఒప్పుకున్నారన్నారు.

నిజానికి చాందిని హత్య జరిగిన ప్రాంతానికి సాయి కిరణ్‌ రెడ్డి రెండు నెలల క్రితమే వెళ్లి పరిశీలించి వచ్చాడని సీపీ శాండిల్య వెల్లడించారు. చాందిని, నిందితుడు ఇద్దరూ ఆటోలో అక్కడకు వెళ్లారని చెప్పారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చాందినికి చాలా ఎక్కువ మంది స్నేహితులే ఉన్నారట. ఈ నెల 1వ తేదీ నుంచి 3 వరకూ జరిగిన గెట్ టు గెదర్‌ మరో వ్యక్తితో చాందిని సన్నిహితంగా మెలగడం సాయి కిరణ్‌కు నచ్చలేదట. ఈ నెల 9న సోహైల్ అనే వ్యక్తితో చాందిని పబ్‌కు వెళ్ళాలనుకుందని, కానీ సాయి కిరణ్ పిలవడంతో పబ్‌కు రాలేనని సోహైల్‌కు చెప్పిందట. తనతోనే కాకుండా మరో ఇద్దరితో కూడా చాందిని సన్నిహితంగా ఉండడం, పెళ్ళి చేసుకోవాలంటూ తనను చాందిని ఒత్తిడి చేయడమూ సాయి కిరణ్‌కు నచ్చలేదట. లైఫ్‌లో సెటిలయ్యాక పెళ్ళి చేసుకుందామని తాను చెప్పినా చాందిని వినకుండా గొడవ చేయడంతో మాటా మాటా పెరిగి కొట్టానని, చున్నీని ఆమె మెడకు బిగించి చంపినట్లు సాయి కిరణ్ చెప్పాడని సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆ తరువాత చాందిని మృతదేహాన్ని గుట్ట మీద నుంచి పది అడుగుల కిందికి తోసేసినట్లు సాయి కిరణ్ చెప్పాడన్నారు. చాందిని మొబైల్‌ను అక్కడికి దగ్గర్లో ఉన్న నీటి గుంతలో పడేసి, వేరే దారి గుండా వెనక్కి వచ్చేసినట్లు చెప్పాడన్నారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీపీ శాండిల్య సలహా ఇచ్చారు. పిల్లలు ప్రతి దానికీ ఫేస్‌బుక్ పైన, సోషల్ మీడియా పైన ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటున్నారని, ముక్కూ ముఖం తెలియని వారితో కూడా స్నేహం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సీపీ చెప్పారు. అందుకే పిల్లల మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత పెరగాలన్నారు. ఈ కేసులో మ‌ృతురాలు, నిందితుడు ఇద్దరూ మైనర్లే అని సీపీ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు.