వీవీఐపీల రహస్య టూర్లకు చెక్!

08 October, 2019 - 3:03 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం వీవీఐపీలు ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్‌పీజీ సిబ్బంది వారిని నీడలా వెన్నంటి ఉండి తీరుతారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు. భారత పార్లమెంటును రక్షించడానికి ఈ బృందాన్ని అంకితం చేస్తూ పార్లమెంటు 1988 లో ఎస్‌పీజీ చట్టాన్ని ఆమోదించింది. తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన ఎస్పీజీ రక్షణను 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం ఉపసంహరించింది.

కాగా.. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్‌ గాంధీకి ఎస్పీజీ భద్రత ఉంది. అనునిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అలాంటిది కనీసం ప్రస్తుతం వారిని కూడా తనతో విదేశాలకు రానివ్వడం లేదు. ఉన్నట్లుండి మాయమవడం.. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల తీరుగా ఉంది. రాహుల్ గాంధీ కాంబోడియా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించడం చర్చనీయాంశమైంది.

ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించిన నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఎస్పీజీ సిబ్బంది ఉంటారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఎస్‌పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ పర్యటనలను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది.

గాంధీ కుటుంబీకులు ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్‌పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడి నుంచి ఎస్‌పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించుకొని వచ్చేవారు. అలా చేసే కొన్ని సందర్భాలో వీరు భద్రతాపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.