పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తేరట

10 July, 2019 - 8:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేది లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. తద్వారా పెట్రో ఉత్పత్తును జీస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలను కేంద్రం తోసిపుచ్చింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ అంశంపై అధ్యయనానికి టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఫిర్యాదేదీ చేయలేదని రెవెన్యూ శాఖ తెలిపిందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 7వ ఆర్టికల్‌లో పొందుపరిచిన జాబితాలో పెట్రోలియం క్రూడ్‌తో పాటు విమానాలకు వినియోగించే ఇంధనం, గ్యాస్, హై స్పీడ్ డీజిల్, మోటర్ స్పిరిట్‌పై సుంకాన్ని విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.