బాబుకు ఇక బ్యాండ్ బాజా..?!

18 May, 2018 - 2:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందన్న ఆంధ్రప్రదేశ్‌‌లోని బీజేపీ నేతల వ్యాఖ్య. దక్షిణాదిలో అదీ కూడా పెద్ద రాష్ట్రమైన కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో బీజేపీ 104 సీట్లు సాధించింది. ఈ ఫలితం దక్షిణాదిలోని కమలనాథుల్లోనే కాకుండా హస్తినలోని ఆ పార్టీ అగ్రనేతల్లో కూడా మాంచి జోష్ నింపిందనే చెప్పాలి. ఇదే ఊపు ఉత్సాహంతో దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని కమలదళం ఓ నిర్ణయానికి వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకిల్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి, ఆ స్థానంలో కాషాయం జెండా రెపరెపలాడించాలని బీజేపీ నేతలు తెగ ఊవ్విళ్లూరుతున్నారు.

ఈ క్రమంలో కమలదళాధినేతలు వ్యూహ రచనను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నిధుల విషయంలో కేంద్రం మోకాలు అడ్డటంతో పాటు చంద్రబాబుకు ఊపిరాడకుండే చేసే విధంగా ఆయన అవినీతికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయాలని యోచిస్తున్నారట. ఆదే విధంగా బాబు వ్యతిరేకుల్ని సమీకరించే పనిలో కూడా వారు పడినట్లు సమాచారం.

ఆర్‌ఎస్ఎస్ నాయకుడు, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీకీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిపించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్. ఆయన తాజాగా కర్ణాటకలో బీజేపీ గెలవడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంద్రబాబుకు ట్విట్ చేస్తూ.. మీ మాట కన్నడ సీమలో ఎవ్వరూ వినలేదంటూ రామ్ మాధవ్ పేర్కొన్నారు. అలాగే కమలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే మరి కాస్త ముందుకెళ్లి… కర్ణాటక ఎన్నికల తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామంటూ మీడియా సాక్షిగా ప్రకటించడం గమనార్హం.

ఈ విషయాన్ని చంద్రబాబు అండ్ కో చాలా లైట్‌‌గా తీసుకుందట. తెలుగు తమ్ముళ్లే కాదు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సైతం కర్ణాటక వెళ్లి తెలుగువారిని బీజేపీ మోసగించిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించి మరీ వచ్చారు. కానీ ఫలితం మాత్రం బీజేపీకీ అనుకూలంగా వచ్చింది. దీంతో పచ్చ పార్టీ నేతలకు ఇది మింగుడు పడని వ్యవహారంగా మారిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌‌కు చంద్రబాబు పేరు వింటేనే ఓ రేంజ్‌‌లో నిప్పులు చెరుగుతారు. అలాగే వామపక్షాల నాయకులు కూడా చంద్రబాబును టచ్ మీ నాట్ అంటూ దూరం పెట్టేశారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే మార్చి 14న ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు, లోకేష్ బాబుతో పాటు ఆ పార్టీ నాయకుల అవినీతి దుమ్ము దులిపేశారు. దీంతో అన్ని పార్టీలు చంద్రబాబు పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆత్మరక్షణలో పడ్డారు. మోదీ ప్రభుత్వం నుంచి తొందరపడి ముందే బయటకు వచ్చామా? అనే ప్రశ్న చంద్రబాబుతో సహా అందరిలో మొదలైందనే టాక్ అమరావతిలో హల్‌‌చల్ చేస్తోంది. ఏది ఏమైనా మోదీ, అమిత్ షా ద్వయం కలసి ముందుకు వెళ్లితే.. చంద్రబాబు పని ఖాళీ అయిపోయినట్లే అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబుగారికి పట్టపగలే కాషాయం నేతలు చుక్కలు చూపిస్తారంటూ సెటైర్లతో రాజధాని ప్రాంతం వేడిక్కిపోతోంది.