రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కుదరదు

10 August, 2018 - 12:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భాకత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, మరో న్యాయవాది రాజేష్ రంజన్‌లు కేంద్రం తరఫున జస్టిస్ రంజన్ గగోయ్ బెంచ్ ముందు కేంద్రం నిర్ణయాన్ని వెల్లడించారు.

రాజీవ్ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్రం రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని శుక్రవారం న్యాయస్థానానికి తెలిపింది. రాజీవ్ గాంధీని హతమార్చిన వారికి క్షమాభిక్ష ప్రసాదించి, జైలు నుంచి విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అనుమతించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలనుకోవడం చాలా ప్రమాదకరమైన చర్య అని కేంద్రం ప్రకటించింది. రాజీవ్ హత్య కేసులో దోషులైన ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించడం తప్పని కేంద్రం స్పష్టం చేసింది. భారత ప్రజాస్వామ్య దేశంలో రాజీవ్ గాంధీని హత్య చేయడం దారుణమని, ఈ కేసులో దోషులకు సరైన శిక్ష విధించాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది.

ఇలా ఉండగా.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని రాజ్యాంగంలోని 161 అధికరణ ప్రకారం గవర్నర్‌ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజీవ్‌ హంతకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వారిని విడుదల చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

1991 మే 21న ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.