కోల్‌కతా మాజీ సీపీపై లుకౌట్ నోటీస్

27 May, 2019 - 5:37 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌పై ఆదివారంనాడు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు కోరింది. అంతేకాకుండా ఏడాది పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. రాజీవ్‌కుమార్‌పై లుకౌవుట్‌ నోటీసులు జారీచేసిన అనంతరం ఆదివారం రాత్రి కొందరు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో రాజీవ్‌ ఇక్కడ ఉండేవారని, ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉండడం లేదంటూ ఆ నివాసం వద్ద డ్యూటీలో ఉన్న గార్డులు తెలిపారు. దీంతో వెంటనే వారు కోల్‌కతా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ ‌పోలీస్‌ కార్యాలయానికి వెళ్లి రాజీవ్‌ కుమార్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు.

శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై ఇటీవల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు యత్నిస్తున్నారంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాజీవ్‌ కుమార్‌ విచారణకు సహకరించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే.. ఈ కేసులో రాజీవ్ కుమార్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాజీవ్‌ కుమార్‌ను ప్రభుత్వం బెంగాల్‌ సీఐడీ ఏడీజీగా తొలగించింది. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.