మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు సమన్లు

24 August, 2019 - 8:46 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో బొత్సకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న తమ ముందు హాజరు కావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు.

విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌ వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు మోసం చేశారనేది కేసులో ప్రధాన అభియోగం. వశిష్ఠ వాహన్‌ మాజీ అధికారి హెల్మట్‌ షూష్టర్‌, భారత ప్రతినిధి అశోక్‌ కుమార్‌ జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీ రాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వాంగ్మూలం నమోదు చేసేందుకు సెప్టెంబర్‌ 12న హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.