ప్రేమ పెళ్లయిన కొత్త జంటకు ట్రాజెడీ

13 January, 2018 - 5:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఖమ్మం: పెద్దలకు ఇష్టం లేకపోయినా స్వతంత్రించి పెళ్ళి చేసుకుని పారిపోతున్న ప్రేమజంటను వధువు తరఫు బంధువులు వెంబడించడంతో వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా ప్రేమ జంట సహా ముగ్గురు గాయపడ్డారు.

విషయం ఏంటంటే.. భ​ద్రాచలంలో శనివారం ఉదయం పెళ్ళి చేసుకుని తిరిగి వస్తుండగా విషయం తెలిసిన అమ్మాయి తరపు బంధువులు వాహనాల్లో వెంబడించారు. దీన్ని గమనించిన ప్రేమజంట ప్రయాణిస్తున్న కారు వేగం పెంచడంతో ఖమ్మం గోపాలపురం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ప్రేమజంటతో పాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఇల్లందు పట్టణానికి చెందిన సుమ, తరుణ్‌ ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ శుక్రవారం భద్రాచలంలో వివాహం చేసుకున్నారు. శనివారం ఉదయం కారులో ​పయనమయ్యారు. విషయం తెలిసిన సుమ బంధువులు కారును వెంబడించారు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. తరుణ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.