పురుషులకు రేప్ చట్టం వర్తించదా?

28 September, 2017 - 1:00 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మగవాళ్లలోనూ అత్యాచార బాధితులుంటారని దాఖలైన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తమ అభిప్రాయాన్ని చెప్పాలంటూ ఆదేశించింది. మగవాళ్లపై అత్యాచారం జరిగితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి ఉందని సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా గుర్తించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

అత్యాచార కేసుల్లో కేవలం మహిళలనే బాధితులుగా చూస్తున్నారని, ఈ విషయంలో చట్టాల్లోనే లింగ వివక్ష ఉందని, పురుషుల్లో కూడా అత్యాచార బాధితులు ఉన్నారని తెలిపారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరి శంకర్ లతో కూడిన బెంచ్ కేంద్రానికి నోటీసులు పంపింది. ఎంతో మంది పురుషులు కూడా అత్యాచారానికి గురవుతున్నారని, వారంతా బయటకు రాకపోవడానికి పితృస్వామ్య భావన కూడా కారణమని పిటిషనర్ చెప్పుకొచ్చారు.

మహిళలతో పోలిస్తే, పురుషులపై అత్యాచారాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ వాటిని కూడా చట్టం మరువరాదని పిటిషనర్ వాదించారు. ఒకవేళ తనపై అత్యాచారం జరిగిందని ఎవరైనా పురుషుడు ఫిర్యాదు చేస్తే, అతన్ని ‘నిజమైన మగాడు’గా సమాజం పరిగణించడం లేదని తన పిటిషన్ లో తెలిపాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో ఉన్న సమానత్వ హక్కును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దీనిపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు ఇస్తూ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేసింది.