అమెరికాను కమ్మేస్తున్న కార్చిచ్చు పొగలు

10 August, 2018 - 11:28 AM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్‌: కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ద్వారా వెలువడుతున్న పొగలు అమెరికాను కమ్మేస్తున్నాయి. వారం రోజులుగా సుమారు 1,87,000 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు దగ్ధం చేసినట్లు అమెరికా జాతీయ అగ్నిమాపక సంస్థ వెల్లడించింది. ‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌’ అని పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల మంటలు అంటుకున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్‌‌వాన్‌ ప్రావిన్స్‌‌లు కూడా అలెర్ట్‌‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌ విధించారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ సెంటర్‌ హెచ్చరించింది. ముఖ్యంగా హృద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద కార్చిచ్చుగా చెబుతున్న ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రం మరింత కాలుష్యంతో నిండిపోయిందని వాతావరణ నిపుణుడు స్టీవెన్‌ డిమార్టినో అన్నారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.