సొంత గూటికి బైరెడ్డి..చేరికపై చర్చలు?

29 December, 2017 - 1:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన సొంత గూటిలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) పార్టీ రద్దు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే అది నిజమేననిపిస్తోంది. అమరావతిలోని సచివాలయంలో బైరెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. వారిద్దరి మధ్య అరగంటకు పైగా చర్చలు జరిగాయి.

స్థానిక సంస్థల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌ ఏకగ్రీవం చేసే అం శంతోపాటు బైరెడ్డి టీడీపీలో చేరికపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. టీడీపీలోకి చేరాక పార్టీలో ప్రాధాన్యం, 2019 ఎన్నికల్లో తీసుకోవాల్సిన వ్యూహాలు తదితర వాటిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బైరెడ్డి తన అనుచరులతో సీఎం సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఈ చర్చలు సుగమం చేశాయని ప్రచారం జరుగతోంది. 2013లో టీడీపీని వీడిన తర్వాత ఇప్పటివరకు బైరెడ్డి.. చంద్రబాబును కలవలేదు. ఐదేళ్ల విరామం తర్వాత గురువారం సీఎంను కలిశారు. సీఎం చంద్రబాబు, బైరెడ్డి కలయికలో డిప్యూటీ సీఎం కేఈ సోదరులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించారు. ఉద్యమాలు, బస్సుయాత్రలు చేశారు. ఆగస్టులో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో ఆర్పీఎస్‌ అభ్యర్థి భవనాసి పుల్లయ్యకు 154 ఓట్లకు మించి రాకపోవడంతో.. బైరెడ్డి ఆర్పీఎస్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ఆ వెంటనే టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. అదే సమయంలో బైరెడ్డి వైసీపీలో చేరునున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే బైరెడ్డి మనస్తత్వం తెలిసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో అసలు ఆ దిశగా యత్నాలను మానేసిన బైరెడ్డి… తిరిగి సొంత గూడు టీడీపీలో చేరేందుకు ముమ్మర యత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

తన తండ్రి బైరెడ్డి శేషశయనారెడ్డి హయాం నుంచి కూడా టీడీపీలో కొనసాగుతూ వస్తున్న బైరెడ్డి… జిల్లాలోని నందికొట్కూరును తనకు పెట్టని కోటగా చేసుకున్నారు. అయితే బైరెడ్డికి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అంతగా పట్టు లభించలేదన్న వాదన ఉంది. టీడీపీలో ఉండగానే అటు కేఈ కృష్ణమూర్తి వర్గంతో ఢీ అంటే ఢీ అంటూ సాగిన బైరెడ్డి… జిల్లాలోని మిగిలిన టీడీపీ నేతలతోనూ పెద్దగా సఖ్యతగా మెలగలేకపోయారు. అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చేసిన బైరెడ్డి… రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)పేరిట ఓ పార్టీని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక రాయలసీమ కోసం పోరు సాగించారు. అయితే జిల్లా వ్యాప్తంగా తనకు కేడర్ లేకపోవడంతో బైరెడ్డి… సదరు ఉద్యమాన్ని కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారనే చెప్పాలి. మొత్తం రాయలసీమ వ్యాప్తంగా యాత్ర చేసినా… బైరెడ్డికి పెద్దగా కలిసి వచ్చిన దాఖలా కనిపించలేదు.

కర్నూలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైసీపీ బరి నుంచి తప్పుకున్నా… టీడీపీ అభ్యర్థిగా ఖరారైన కేఈ ప్రభాకర్ పై బైరెడ్డి తన అభ్యర్థిని బరిలోకి దింపారు. తన అనుచరుడు, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డిని పోటీకి నిలిపారు. ఈ నామినేషన్‌ను ఉపసంహ రింపజేసేందుకు కేఈ సోదరులు పావులు కదిపారు. ఇందులో భాగంగానే కేఈ ప్రభాకర్‌ బుధవారం కర్నూలులో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని కలిశారు. 45 నిమిషాలు చర్చలు సాగించారు. మరుసటి రోజే గురు వారం సాయంత్రం బైరెడ్డి.. సీఎంను కలిశారు.

చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అంశాలేమీ తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. తాను టీడీపీలో చేరే విషయంలో మాత్రం బాబు సానుకూలత వ్యక్తం చేసినట్లుగా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. తన కార్యకర్తలతో చర్చించి… సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరే విషయంపై ప్రకటన చేస్తానని కూడా బైరెడ్డి ప్రకటించారు. జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కేసీ కెనాల్‌ పరిధిలోని కర్నూలు, నంది కొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డతో పాటు ఎగువన ఉన్న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు నీటి సమస్య తీరుతుందని చెప్పారు. గుండ్రేవుల జిల్లాకు ఎంతో అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో పాటు సిద్ధేశ్వరం అలుగు, ఆర్డీఎస్‌ కుడి కాల్వ గురించి వివరించినట్లు చెప్పారు. రాయలసీమకు సాగు, తాగునీటి సమస్య తీరాలంటే శ్రీశైలం జలాశ యం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా చట్టం చేయాలని సీఎంని కోరారు.