ఎక్స్‌ప్రెస్‌వేపై యూపీ బస్సు బీభత్సం

11 June, 2018 - 12:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌‌లో సోమవారం ఉదయాన్నిే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ సమీపంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై యూపీ రోడ్‌‌వేస్‌ బస్సు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ బస్సుతో సహా పరారయ్యాడు. బీటీసీ చదువుతున్న విద్యార్థులంతా హరిద్వార్‌‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

వేగంగా వస్తున్న యూపీ రోడ్‌‌వేస్‌ బస్సు విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనే సమయంలో మరో బస్సుకు డీజిల్‌ పోస్తుండటంతో కొందరు విద్యార్థులు బస్సు దిగి ఉన్నారని, లేకపోతే మృతుల సంఖ్య మరింతగా పెరిగిపోయి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల్లో ఓ అధ్యాపకుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనా స్థలానికి అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు.