లోయలోకి బస్సు.. ప్రయాణికులు క్షేమం

13 January, 2019 - 11:53 AM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీశైలం (కర్నూలు జిల్లా): శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులతో ఉన్న ప్రైవేట్ టూరిస్టు బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవడంతో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే.. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పినట్లయింది. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌ రోడ్డుపై ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

మహారాష్ట్రకు చెందిన 36 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పింది. ఘాట్‌ రోడ్డుకు రక్షణగా ఉన్న గోడను ఢీకొని లోయలోకి జారిపోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడు జిల్లా పెరళికి చెందిన 36 మంది ప్రయాణికులు టూరిస్టు బస్సులో శ్రీశైలం యాత్రకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు డోర్నాల అటవీశాఖ ‌టోల్‌‌గేట్‌ దాటిన బస్సు శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలోని చిన్నారుట్ల మలుపు వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణీకులను సురక్షితంగా బస్సులో నుంచి కిందకు దించారు. సహాయ చర్యలు చేపట్టారు.