భారత్‌-జపాన్‌ రక్షణపై ప్రధానులు చర్చ

14 September, 2017 - 9:27 AM


(న్యూవేవ్స్ డెస్క్)

గుజరాత్: అహ్మదాబాద్‌లో హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర రైలు మార్గ నిర్మాణానికి భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది నవంబరులో మోదీ జపాన్ పర్యటనలో బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి పూర్తవుతుంది. దేశంలోని తొలి బులెట్‌రైలు మార్గం అహ్మదాబాద్‌-ముంబై మధ్య రానుండడంతో దానికి సంబంధించిన శిక్షణను అందించడానికి వడోదరాలో రూ.600 కోట్ల వ్యయంతో హైస్పీడు రైలు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న అబే.. గురువారం బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రక్షణ, భద్రతా రంగాల్లో సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు. గాంధీనగర్‌లో జరిగే భారత్-జపాన్ 12వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు షింజో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటుగా.. గుజరాత్‌లో జపాన్‌ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలూ జరగనున్నాయి. ఈ సదస్సులోనే గుజరాత్‌లో పెట్టుబడులకు సంబంధించి 15 ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న యూఎస్‌–2 ఉభయచర యుద్ధవిమానాల కోనుగోలు, సంయుక్తంగా ఆయుధాల తయారీ, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి. భారత్‌కు జపాన్‌ ఆయుధాలను విక్రయించనుందన్న వార్తల నేపథ్యంలో ఆ దేశంపై గతేడాది చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మానవరహిత యుద్ధ వాహనాలు, రోబోటిక్స్‌ విషయంలో ఇటీవలే భారత్‌–జపాన్‌ మధ్య వాణిజ్య సాంకేతిక ఒప్పందాలు కూడా కుదిరాయి. అణుశక్తి సహ కారం పైనా ఇరువురు ప్రధానులు చర్చించే అవకాశం ఉంది. ఉత్తర కొరియాతో జపాన్‌కు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌-జపాన్‌ రక్షణ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దాదాపు 8 కి.మీ. మేర రోడ్డుషో నిర్వహించారు. జపాన్‌ ప్రధానికి, ఆయన భార్య అకీకి మోదీ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగినపుడు అబే సూట్‌లో కనిపించారు. కానీ రోడ్‌ షోకు సిద్ధమయ్యేటప్పటికి.. రెండు ఆసియా దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించేలా మోదీ తరహాలో కుర్తా పైజామా ధరించగా.. అకీ ఎరుపురంగు సల్వార్‌ కమీజ్‌ ధరించి ప్రత్యేకంగా కనిపించారు.