అర్ధరాత్రి తీరం దాటిన ‘బుల్‌బుల్’

10 November, 2019 - 6:19 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగిన అతితీవ్ర తుపాను బుల్‌బుల్‌ క్రమంగా బలహీన పడి, శనివారం అర్ధరాత్రి తీరం దాటింది. అంతకు ముందు ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి శనివారం సాయంత్రానికి వాయవ్య బంగాళాఖాతం వద్ద పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశగా 175 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ దిశగా 50 కిలోమీటర్లు, కోల్‌కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా బలహీనపడుతూ బుల్‌బుల్ తీవ్ర తుపానుగా మారింది.

ఆ తరువాత ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల మధ్య శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరాన్ని దాటింది. బుల్‌బుల్ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్‌ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బుల్‌బుల్‌ తుపాను తీరం దాటినప్పటికీ సముద్రంలో అలజడి ఉండటంతో ఆదివారం కూడా మత్స్యకారులు ఎవ్వరూ చేపలవేటకు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బుల్‌బుల్‌ ప్రభావం ఎక్కువగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలపై ఉంటుంది. మరోవైపు ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడం గమనార్హం.

బుల్‌బుల్‌ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో సహాయక సామాగ్రితో మూడు నౌకలను రెడీగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళేందుకు ఐఎన్‌ఎస్‌ డేగా నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో గజ ఈతగాళ్లు, జెమినీ బోట్లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎయర్‌క్రాఫ్ట్‌ల ద్వారా నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహించి, తీవ్రతను గమనించి ఆయా ప్రాంతాలకు రిలీఫ్‌ మెటీరియల్‌ అందిస్తామని తూర్పు నావికాదళం అధికారులు తెలిపారు.