జవాన్‌ను ఇంటికెళ్లి మరీ కాల్చిచంపారు

28 September, 2017 - 9:58 AM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులో మరోసారి రెచ్చిపోయారు. మూడు నెలల క్రితం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన లెఫ్టినెంట్ యుమర్ ఫయాజ్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చంపిన ఉగ్రవాదులు తాజాగా బండిపొరాలో ఇంటికెళ్లి మరీ ఓ బీఎస్ఎఫ్ జవానును దారుణంగా కాల్చిచంపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బండీపొరాలో ఉంటున్న జవాను మొహమ్మద్ రమ్‌జాన్ పారే (23) లీవ్ పెట్టి ఊరెళ్లాడు.. అయితే తన ఊరు వద్ద కాపు కాసిన ఉగ్రవాదులు అతడి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. రమీజ్ అక్కడిక్కడే చనిపోగా.. రమీజ్ కుటుంబంలోని మరో ముగ్గురు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


బారాముల్లాలోని 73 బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన గత 20 రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు జవానును కాల్చి చంపినప్పుడు ఆయన ఇద్దరు సోదరులు జావిద్, సాహిబ్, తండ్రి గులామ్, అత్త హెబ్బా బేగం ఉన్నారు. పారేని బలవంతంగా బయటకు తీసుకొస్తున్నప్పుడు వారు అడ్డుకున్నారు. ఏమాత్రం కనికరించని ఉగ్రవాదులు ఆటోమెటిక్ రైఫిల్స్‌తో పారీని కాల్చి చంపారు. ఉగ్రవాదులు తొలుత జవానును కిడ్నాప్ చేద్దామనుకున్నారని, అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కాల్చి చంపారని బండీపొరా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జుల్ఫికర్ ఆజాద్ తెలిపారు.