విద్యార్థినిని చంపేసిన ప్రేమోన్మాది

11 May, 2018 - 11:03 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌‌లో దారుణం జరిగిపోయింది. ప్రేమ పేరుతో సాయి ప్రసాద్ అనే యువకుడు డిగ్రీ విద్యార్థిని శిరీషను కొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (20) ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో శిరీషను వేధిస్తున్న సాయిప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పాడ్డారు.

శిరీష, సాయి ప్రసాద్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని సాయి ప్రసాద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది.

శిరీషపై కోపం పెంచుకున్న సాయి ప్రసాద్‌ పథకం ప్రకారం మాట్లాకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌‌కు పిలిచాడు. రిసార్ట్‌‌లో కాటేజీ బుక్‌ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. అనంతరం యువకుడి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను మోసం చేస్తోందని ఆవేశంగా ఉన్న సాయి ప్రసాద్‌ శిరీష గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రిసార్ట్‌ యాజమాన్యం విషయాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.

అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్య మధ్యాహ్నం 2 గంటలకు జరిగితే, రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులకు విషయం తెలియచేశారు.
హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని శిరీష మృతదేహంతో రిసార్ట్‌ ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో నిందితుడు సాయి ప్రసాద్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్‌ కన్నీరు మున్నీరు అయ్యారు. పెళ్లి కాని వారిని రిసార్ట్‌‌లోకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు.రిసార్ట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా.. గడచిన ఆరేళ్లుగా తనతో కలిసి తిరుగుతూ, ఇప్పుడు వేరే వ్యక్తితో చనువుగా ఉందన్న ఆగ్రహంతోనే శిరీషను హత్య చేశానని సాయి ప్రసాద్ అంగీకరించినట్టు సమాచారం. శిరీష వాష్‌రూంలో రిఫ్రెష్ అవుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన సాయి పదునైన కత్తితో గొంతు కోసి, ఆపై చాతీలో పొడిచి హత్య చేశాడు. అంతకు ముందు తనను వివాహం చేసుకోవాలని ఆమెను వేడుకున్నానని అయినా వినలేదని చెప్పడం గమనార్హం.