సోషల్ మీడియా ద్వారా గ్యాస్ బుకింగ్!

10 January, 2018 - 12:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: ఇప్పటివరకు స్నేహితులతో ఛాటింగ్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కోసం మాత్రమే సోషల్ మీడియాని ఉపయోగించే వాళ్లు. అయితే, ఇక నుంచి గ్యాస్ బుకింగ్ కూడా సోషల్ మీడియా నుంచే చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభంగా. ఫోన్‌తో పని లేకుండా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌకర్యం కల్పించింది.

ఇకపై సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా ఇండేన్ గ్యాస్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ విధానంలో సిలిండర్‌ను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండేది. అయితే, డిజిటలైజేషన్‌ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కల్పించింది. ఇది వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభిప్రాయపడింది.

ట్విట్టర్ ద్వారా బుక్ చేసుకోవాలంటే…
ట్విట్టర్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత refill @indanerefill అంటూ ట్వీట్ చేయాలి. ఆ తర్వాత పేరు, ఈ మెయిల్, ఎల్పీజీ నంబర్ ను నమోదు చేయాలి. మొదటిసారి ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నవారు register LPGID అని ట్వీట్ చేయాలి.

ఫేస్ బుక్ ద్వారా బుక్ చేసుకునేవారు…
ఫేస్ బుక్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేజ్ ను ఓపెన్ చేయాలి. కుడివైపు బాక్స్ లో ‘బుక్ నౌ’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి, పేరు, ఈ మెయిల్, ఎల్పీజీ నంబర్ ను నమోదు చేయాలి. ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బు చెల్లించే అవకాశం ఉంది.