లక్ష్మీ పార్వతీగా ఎవరంటే?

05 November, 2018 - 2:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా.. అంతా వెరైటీనే. ఓ వైపు క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇది రెండు భాగాలుగా వస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ఒదిగిపోయి నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 జనవరిలో విడుదల కానుంది.

అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నా సంగతీ తెలిసిందే. ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టారు. ఇటీవల తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ సమక్షంలో రామ్ గోపాల్ వర్మ నిర్వహించిన విషయం విదితమే. కాగా త్వరలో ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రలో మోడల్‌ రుపాలి సూరిని వర్మ ఎంపిక చేశారని తెలుస్తోంది. ముంబయికి చెందిన రుపాలి ‘డ్యాడ్‌, హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించారు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నారని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.