పాపికొండలు టూరిస్ట్ బోట్‌లో మంటలు

11 May, 2018 - 12:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

దేవీపట్నం (ప.గో.జిల్లా): పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గోదావరి నది అందాలను, కిన్నరెసాని హొయలను తిలకించాలని బయలుదేరిన పర్యాటకుల పడవ అగ్నిప్రమాదానికి గురైంది. పాపికొండలు యాత్రకు వెళుతున్న ఓ పడవలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

పోశమ్మగండి నుంచి పాపికొండల యాత్రకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురై, తమ సెల్ ఫోన్ల నుంచి దగ్గర్లో ఉన్న పరిచయస్తులకు, పోలీసులకు ఫోన్లు చేశారు.

పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు నదిలో ఈదుకుంటూ వెళ్లి 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు.

పడవలోని జనరేటర్‌‌లో షార్ట్‌‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే.. పడవలో ఉన్న సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా కొందరు చెబుతున్నారు. ఆ పడవ పాతదైనందువల్ల ఇంజన్ హీటెక్కి ప్రమాదం జరిగినట్లు మరో కథనం వినిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాద ఘటనతో పడవలోని పర్యాటకులను కిందికి దింపేసిన నిర్వాహకులు వేరే బోటులో తరలించారు.