షిప్‌యార్డ్‌లో పేలుడు: ఐదుగురు మ‌ృతి

13 February, 2018 - 3:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కొచ్చి: కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో మంగళవారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 11 మందికి తీవ్రగాయాలు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం కొచ్చి షిప్‌యార్డ్‌లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి చెందిన సాగర్ భూషణ్ షిప్‌లో ఈ పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.

షిప్‌లో మరమ్మతులు చేసే వాటర్ ట్యాంక్ దగ్గర పేలుడు జరిగిందని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

షిప్‌లకు మరమ్మతులు చెయ్యడంలో కొచ్చి షిప్‌యార్డ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. పేలుడు ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా కొచ్చి షిప్‌యార్డ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.