‘ఇది దారుణం’ అనలేకపోయారే!

12 September, 2017 - 6:18 PM

ఒక హత్య పట్ల సమాజం స్పందన ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం హత్యకు గురయిన వ్యక్తిని బట్టి మారుతుందేమో! అదేమో గానీ అన్ని హత్యలూ సమాజం దృష్టిని ఆకర్షించవు. కొన్ని మాత్రమే ఆ కోవలోకి వస్తాయి. ఇందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. కారణాలన్నీ మనకు ఇక్కడ అవసరం లేదు. హత్యకు గురయిన వారు ప్రముఖులైన కారణంగా చర్చ జరుగుతుంది చూడండి, అది కావాలి. సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్య నేపధ్యంలో ఈ అవసరం వచ్చింది.

చూశారా! నేను నా స్పందన అనుకోకుండానే చెప్పాను. ముందు ఆలోచన లేకుండానే  గౌరీ లంకేశ్ హత్యకు ‘దారుణం’ అనే ఒక విశేషణం జోడించాను. గౌరి ఓ నడివయస్సు మహిళ. తండ్రి నుంచి వారసత్వంగా అందిన పత్రికను పట్టుదలగా ధైర్యంగా నడుపుతున్న జర్నలిస్టు. తాను నమ్మిన విలువల కోసం జర్నలిజాన్ని, కార్యాచరణనూ ఏకం చేసిన ధీశాలి.

ఆమె నమ్మిన సిద్ధాంతాలే అందరూ నమ్మాలని లేదు. తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేసుకునేందుకు గౌరీకి ఉన్న హక్కు, వాటిని వ్యతిరేకించే వారికి కూడా ఉంది. అయితే వారు – వారెవరైనా గానీ – అలాంటి ప్రజాస్వామిక విధానం ఎంచుకోకుండా భౌతికంగా ఆమెను అంతం చేసే దారి ఎంచుకున్నారు. గౌరి హత్య ఎందుకు  దారుణం అంటే అందుకు! (ఎవరి హత్య అయినా ఖండనార్హమే అన్నది వేరే సంగతి). మరి గౌరీ లంకేష్ హత్య వార్త బయటకు రాగానే ‘ఇది దారుణం’ అని అందరూ ఎందుకు అనలేక పోయారు? కొందరు సోషల్ మీడియాలో ఎందుకు పండగ చేసుకున్నారు?

గౌరి హత్యకు ముందు అలాంటి పద్ధతిలోనే మూడు హత్యలు జరిగాయి. నరేంద్ర ధబోల్కర్, గోవింద పన్సారే, ఎం.ఎం. కలబుర్గి అదే పద్ధతిలో హతులయ్యారు. ఈ ముగ్గురికీ మధ్య ఉన్న స్వామ్యం ఏమంటే హేతుబద్ధత, మత రాజకీయాల పట్ల వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేయగలిగిన ధైర్యం. గౌరి బలయింది కూడా ఆ లక్షణాలు ఉన్నందుకే.

నీచ సంస్కారాన్ని ఏ మాత్రం బిడియం లేకుండా బాహాటంగా వ్యక్తం చేసే తెంపరితనం వారికి అక్కడ నుంచి వచ్చింది. అయినదానికీ కానిదానికీ ట్విట్టర్ ఎక్కే నరేంద్ర మోదీ గౌరి హత్యను మాత్రం ఖండించరు.

ఆమె హత్యపై స్పందించిన వారికి ఒక ప్రశ్న ఎదురయింది. ఫలానా వారిని హత్య చేసినపుడు ఎందుకు ఖండిచలేదు అని. ఆ ఫలానా వారు ఎవరంటే కేరళ రాష్ట్రంలో సిపిఎం, ఆరెస్సెస్ మధ్య నడుస్తున్న వైరంలో ఆరెస్సెస్ తరపున హత్యలకు గురవుతున్న వారు. ఆఖరికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఇలాగే ప్రశ్నించారు. ఏ హింస అయినా తప్పే, రాజకీయ హింస అయినా గానీ. అయితే ఇక్కడ ఒక తేడాను మనమందరం గుర్తించాలి. గౌరి హత్యకు గురయింది రాజకీయాలు నడిపినందుకు కాదు, రాజకీయ భావాలు ఉన్నందుకు.

ఒక మహిళా జర్నలిస్టును నడివీధిలో కాల్చిచంపిన ఘోరంపై సమాజంలో ఒకే రకమైన స్పందన రావడం సాధ్యం కాని పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఎవరికీ ఏనాడూ హాని చేయని ఒక మహిళ ప్రాణాలు బలిగొన్న శక్తులను నిర్ద్వంద్వంగా తెగనాడలేని దుస్థితి ఎందుకు దాపురించింది? హత్యను ఖండించలేపోయారు సరే, గౌరి అంత్యక్రియలు కూడా జరగక ముందే సోషల్ మీడియాలో ఆమెపై దూషణలకు దిగే నీచ సంస్కారం ఎక్కడ నుంచి వచ్చింది?

గౌరి లంకేష్ హత్యను సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్న వారు ఎవరో అందరికీ తెలుసు. వారిలో కొందరిని సాక్షాత్తూ ఈ దేశ ప్రధానమంత్రి ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. పైన చెప్పుకున్న నీచ సంస్కారాన్ని ఏ మాత్రం బిడియం లేకుండా బాహాటంగా వ్యక్తం చేసే తెంపరితనం వారికి అక్కడ నుంచి వచ్చింది. అయినదానికీ కానిదానికీ ట్విట్టర్ ఎక్కే నరేంద్ర మోదీ గౌరి హత్యను మాత్రం ఖండించరు. ఆయనకు ఇలాంటి సంఘటనలపై స్పందించే తీరిక ఉండదు. అంతకు ముందు జరిగిన మూడు హత్యలపై కూడా ఆయన నోరు మెదపలేదు. అది చాలదా సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోవడానికి!

నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు కనబడుతోంది. కాని పక్షంలో వివాదం వచ్చినపుడన్నా ప్రధాని దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయాలి కదా! తప్పుకోవడం మాట అలా ఉంచండి; గౌరి మరణం తర్వాత ఆమెపై దూషణలు కురిపించిన వారిని ట్విట్టర్‌లో ప్రధాని మోదీ  ఫాలో అవడాన్ని బిజెపి ఐటి విభాగం నాయకుడు అమిత్ మాలవీయ నిస్సిగ్గుగా సమర్ధించారు. మోదీ రాహుల్ గాంధీని, కేజ్రీవాల్‌నూ ఫాలో అవడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అదీ బిజెపి తెంపరితనం! గౌరి శవం లేవకముందే సోషల్ మీడియాలో ఆమెను అసభ్యంగా దూషించే వ్యక్తీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకే స్థాయి వారన్న మాట!

ఒక వ్యూహంలో భాగం అయినపుడే ఇలాంటి మాటలు వస్తాయి. ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా ట్విట్టర్‌లో మా నాయకుడి స్నేహితులు మారేది లేదని మాలవీయ స్పష్టం చేస్తున్నారు. ఇది వ్యూహం కాక మరేమిటి? మరణించిన వారు ఎలాంటి వారయినా వారిని గౌరవించడం, కనీసం అగౌరవంగా మాట్లాడక పోవడం భారతీయ సంప్రదాయంలో పాటించే మర్యాద. భారతీయ సంప్రదాయం గురించి గొప్ప గొప్ప కబుర్లు చెప్పే సంఘ్ శక్తులు రాజకీయం దగ్గరకొచ్చేసరికి మాత్రం వాటన్నిటినీ జంకూగొంకూ లేకుండా తుంగలో తొక్కగలరు. గౌరిని ఎవరు హత్య చేసిందీ పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఈ లోపు ఆ సంఘటనను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు బిజెపి ఏమాత్రం వెనుకాడదు. కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్నాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి.

మోదీ, అమిత్ షా, వారి అనుచరగణం ప్రవర్తన,  మాటలు చూస్తుంటే హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లిస్‌కు స్టార్ హోదా తెచ్చిన ‘డై హార్డ్’ సినిమా గుర్తుకు వస్తున్నది. అందులో ఏవో గొప్ప ఆశయాల కోసం తుపాకులు పట్టిన టెరరిస్టు పోజుతో కథ నడిపించే విలన్ అసలు లక్ష్యం డబ్బు దోచుకోవడం అని తెలిసిన తర్వాత హీరో, ‘ఇన్ ద ఎండ్ యు ఆర్ ఎ సింపుల్ తీఫ్’ (చివరికి నువ్వు ఉత్త దొంగవన్న మాట) అంటాడు. బిజెపి కూడా అంతే. హిందూ మతోద్ధరణ, హిందూ సమాజం విలువలు ఇవన్నీ ఉత్తి కబుర్లు. వారి అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసం మతం పేరు చెప్పి సమాజాన్నినిట్టనిలువునా చీల్చడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా చీల్చడం వల్ల అధికారం సంపాదించే అనుభవాలు ఒకటొకటిగా  పెరుగుతున్నాయి మరి!

– ఆలపాటి సురేశ్ కుమార్