నాలుగు తరాలుగా మీరేం చేశారు?

10 June, 2018 - 4:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాయ్‌పూర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మండిపడ్డారు. ఛత్తీస్‌‌గఢ్‌‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారు. మేం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం… రాహుల్‌‌కి కాదు.. మేం అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నాలుగు తరాల పాటు మీరేం చేశారని ఆయనను ప్రజలు అడుగుతున్నారు. దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు’ అని అన్నారు.

మోదీ ప్రభుత్వం మన దేశ సరిహద్దులను రక్షిస్తోందని అమిత్‌ షా అన్నారు. పాకిస్తాన్‌ రాత్రి, పగలు దాడులకు పాల్పడుతోందని, మోదీ ప్రభుత్వ పాలనలో మన దళాలు సర్జికల్‌ స్ట్రయిక్స్ జరిపాయని, ‘భారత్‌ మాతా కి జై’ నినాదాలు చేస్తూ తిరిగి వచ్చాయని అన్నారు. అలాగే.. ఎన్డీఏ ప్రభుత్వం భారత్‌‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచిందని పేర్కొన్నారు.