‘అదే కొంపముంచింది’

15 June, 2019 - 8:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆయన జోస్యం చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. శనివారం నల్గొండలో రాజగోపాల్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని.. అదే కాంగ్రెస్ పార్టీ కొంపముంచిందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారంటూ అటు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇటు టీ కాంగ్రెస్ పార్టీ నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు కుంతియా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లితే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని విమర్శించారు.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యాలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆయన కమల తీర్థం పుచ్చుకుంటారంటూ వస్తున్న వార్తలకు దీంతో నిజమే అని అర్ధమవుతోంది. ఈయన గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి గెలుపొందగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ వాటిని వీరిద్దరు ముక్తకంఠంతో ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తోందని… కేంద్రంలో హస్తం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని వీరు ఆశ పడ్డారు.

కానీ బీజేపీ బలమైన అధిక్యం సాధించి.. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వీరిద్దరు కమల తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని వారి అనుచర గణం భావించింది. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందడంతో .. అదే పార్టీలో కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం కమల తీర్థం త్వరలో పుచ్చుకోనున్నారని సమాచారం. అదీకాక ఇటీవల బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్‌తో కోమిటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారట. పార్టీ మారేందుకు రాజగోపాల్ సుముఖత వ్యక్తం చేయగా.. వెంకట్ రెడ్డి మాత్రం ససేమీరా అన్నారని తెలుస్తోంది.