విజయసాయికి వార్నింగ్

22 August, 2019 - 6:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ గురువారం ట్విట్టర్ వేదిగా ఘాటుగా స్పందించారు అబద్దాలలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ్ముడు ఇంకొకరు తయారయ్యారంటూ విజయసాయిరెడ్డిపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఇంకా ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిని సత్యకుమార్ ప్రశ్నించారు.

శిశుపాలుడి మాదిరిగా 100 తప్పులు ఎప్పుడు చేయాలా ? అని ఉబలాటపడుతున్నట్లుందంటూ విజయసాయిరెడ్డిపై సెటైరికల్‌గా అన్నారు. ఇలా చేస్తే.. తర్వాత జరగబోయే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ విజయసాయిరెడ్డికి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామని విజయసాయి రెడ్డి వక్కాణించారని సత్యకుమార్ ఈ సందర్భంగా పేర్కన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం.. అంటే ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్షతో పాటు తాజాగా రాష్ట్ర రాజధాని మార్పు అంశం అంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ ద్వయంతో సంప్రదించే తాము చేస్తున్నట్లు వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కమల దళంలోని అగ్రనేతలు సుజనాచౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్ మండిపడుతున్నారు.