‘తాడేపల్లి వెళ్తా’

11 August, 2019 - 4:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కోత్తూరు తాడేపల్లిలో గోవులు మృతిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం హైదరాబాద్‌లోని స్పందించారు. గోవులు మృతి చెందడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. మూగజీవాలు చనిపోయినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదంటూ మండిపడ్డారు.

ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు ప్రజలకు వివరించాలని ఆయన వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. త్వరలో తాడేపల్లికి వెళ్లి నిజాలను తెలుసుకుంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు.

తాడేపల్లిలోని గోశాలలో శనివారం 105 ఆవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోవులకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై ఇంకా ప్రభుత్వానికి నివేదిక అందజేయలేదు. అయితే గోవుల కడుపులో బ్లోటింగ్ (పొట్ట ఉబ్బరం)కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

పోస్టు మార్టం ప్రాథమిక పరిశీలన ప్రకారం విష ప్రయోగంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడ్డి మినహా అవుల పొట్టలో ఎలాంటి ఆహారం లేదని పశు వైద్యులు గుర్తించారు. కాగా ఆదివారం ఈ గోశాలను మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమ సందర్శించారు. వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.