బీజేపీ నేతలూ బహు పరాక్..!

21 June, 2019 - 12:24 AM

దేశాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం బీజేపీలో చేరినట్లు నిన్నటి దాకా టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి అన్నారు. సంఘర్షణ కంటే సహకారం ద్వారానే సాధించుకోగలమన్నది ఆయన నమ్మకమట. బీజేపీలో చేరటం ద్వారా జాతి నిర్మాణంలో భాగస్వాములవుతారట. ఇప్పుడు విభజన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశిస్తున్నారట. ఇదంతా నిజమేనా..?!

బీజేపీతో విభేదించి ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసే వరకూ ఇదే సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా..? అప్పుడు విభజన చట్టాన్ని అమలు చేయించుకోలేక చతికిలపడిన ఆయన ఇప్పుడు ఆ పార్టీలో చేరినంత మాత్రాన ఆంధ్రుల ఆ కల ఎంతవరకూ నెరవేరుతుంది..?! ఇదే సందర్భంలో బీజేపీలో చేరిన మరో మాజీ టీడీపీ సభ్యుడు టీజీ వెంకటేష్ మాటలైతే మరీ విడ్డూరంగా ఉన్నాయి. బీజేపీలో చేరటం.. ఆయనకు మాతృసంస్థకు వచ్చినట్టుందట. ప్రజలంతా బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారట. తాము కూడా ప్రజల వెంటే వెళ్తున్నామని వక్కాణించారాయన. పైపెచ్చు ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా బీజేపీతో సఖ్యతగానే ఉందనేది ఆయన విశ్లేషణ. మరి ఇదే టీజీ వెంకటేష్ తాను ఇంతకాలమూ ప్రజల వెంట లేననే చెప్పక చెప్పుకుంటున్నారనుకోవాలా? బాబూ.. వెంకటేష్ గారూ.. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నది కేంద్రంలో మాత్రమేనా.. లేక.. ఆంధ్రప్రదేశ్‌లో కూడానా.. కాస్త వివరంగా చెబితే.. అందరూ ధన్యులవుతారు.

సరే.. టీడీపీ రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటులో సీటు సంపాదించిన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్ కమలం పార్టీ తీర్థం తీసుకోవడం ఎవరూ కాదనలేరు.. అయితే.. ఇప్పుడే వారంతా కాషాయదళం కండువా కప్పుకోవడం వెనుక అపర చాణక్యుడి స్క్రీన్‌ప్లే ఉందేమో అనేది కొందరిలో కలుగుతున్న అనుమానం. ఎందుకంటే.. తన పార్టీలోని వారిని ఇతర పార్టీల్లోకి చొప్పించి.. అక్కడి అత్యంత రహస్య సమాచారాలను చేజిక్కించుకోవడం ఆ అపర చాణక్యుడి రాజకీయ నీతి. అంతే కాదు.. ఇతర పార్టీ గుర్తుతో గెలిచిన వారిని తన పంచన చేర్చుకుని, అందలాలు ఎక్కించడంలో కూడా సిద్ధహస్తుడాయన మరి.

గతంలో ఆంధ్రుల అభిమాన నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ అపర చాణక్యుడు తన వారిని కొందరిని కోవర్టులుగా చొప్పించి, ఆ పార్టీ అప్రతిష్ట పాలవడానికి తన వంతు అగ్ని, ఆజ్యం పోశారని అప్పట్లో బాగా వ్యాఖ్యలు వినిపించాయి. ఆనక ఆ పార్టీ అతలాకుతలమైపోయి, చివరికి అస్తిత్వాన్ని కోల్పోయి, జాతీయ పార్టీ కాంగ్రెస్‌లోకి విలీనం కావాల్సిన పరిస్థితి రావడానికి చాలా వరకూ ఆయన కుతంత్రాలే కారణమని కూడా అప్పట్లో కొందరు చెవులు కొరుక్కున్నారు. ఆనక పీఆర్పీ కనుమరుగైన తరువాత తీరిగ్గా ఆ కోవర్టుకు తన ప్రభుత్వంలో ఓ ఉన్నత పదవిలో కూర్చోబెట్టిన ఘనుడు కదా ఆ అపర చాణక్యుడు.

టీడీపీ ఎంపీలు నిజంగా దేశ హితం, ఏపీ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరితే ఎవరికీ ఏమీ అభ్యంతరం కానీ, అనుమానం కాని ఉండనక్కర్లేదు. కాదంటే.. విభేదించి దారుణంగా దెబ్బతిన్న అపర చాణక్యుడు ఆ నలుగుర్నీ కాషాయం పంచకు చేర్చి మళ్ళీ కమలదళంతో కరచాలనం చేయాలనే వ్యూహం ఏమైనా ఉందేమో అనే అనుమానాలు కూడా కొందరిలో రావడం సహజం. ఎందుకంటే.. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్ అపర చాణక్యుడికి అత్యంత సన్నిహితులు.. అందులోనూ అత్యంత ఆప్తులు కూడా. అపర చాణక్యుడి రాజకీయ మంత్రాంగాల వెనుక రాజగురువు ఉపదేశాలు కూడా ఉండి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా ఈ తాజా సంఘటనతో పలువురిలో వ్యక్తం అవుతుండడం గమనార్హం. అలాంటి మంత్రాంగమేదైనా ఉండి.. అపర చాణక్యంలో భాగంగా వారు కమలదళం కండువా కప్పుకుని ఉంటే మాత్రం బీజేపీ నేతలూ బహు పరాక్..!

డి.వి. రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్