జీవీఎల్ నరసింహారావుకు జాక్‌పాట్

13 March, 2018 - 3:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ సభలో కమలం పార్టీ తీర్మానం చేసిన విషయం తెలింసిందే. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి అని కాకుండా ‘రెండుగా వెలుగు జాతి మనది’ అంటూ కమలనాధులు రాష్ట్ర విభజనకు పునుకున్న యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు తర్వాత అధికారంలోకి తమ పార్టీ వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో వెలుగులు పూయిస్తామంటూ 2014 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ గొప్పగా చెప్పారు.

ఆ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన మోదీ ప్రధాని పీఠం అధిష్టించారు. కానీ ఏపీకి ఇచ్చిన విభజన హామీలు మాత్రం నెరవేర్చలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ, బీజేపీల మధ్య దూరం కాస్త పెరిగింది. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం ఇరు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది. 23 జిల్లాలతో దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రంగా ఉన్న ఏపీ విభజించడం ఆంధ్ర ప్రాంత ప్రజలకు అస్సలు ఇష్టం లేదంటూ కూడా సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పట్ల తమకు సానుభూతి మాత్రం ఉందని ఆయన ప్రకటించడం గమనార్హం.

ఈ ప్రకటనతో సీఎం చంద్రబాబు మరింత తీవ్రస్థాయిలో అసంతృప్తి చెందారు. దీంతో కేంద్రప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. ఇటు ఏపీలోని ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇలాంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. అశోక్ గజపతి రాజు రాజీనామా చేసిన పౌర విమానయాన శాఖను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభుకు అప్పగించడం దిద్దుబాటు చర్యల్లో ఒక భాగం కావొచ్చు.

ఇలా ఉండగా బీజేపీ జాతీయ స్థాయి నేతల్లో ఒకరైన జీవీఎల్ నరసింహారావు తెలుగు వారు. ఆయనను రాజ్యసభకు పంపాలని కమలనాధులు నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ నుంచి నరసింహారావును రాజ్యసభకు పంపి, ఆ తర్వాత ఆయనకు కీలకమైన శాఖకు మంత్రిగా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌‌సభ ఎన్నికలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

1998 నుంచి కమలం పార్టీతో జీవీఎల్‌‌కి మంచి అనుబంధం ఉంది. బీజేపీలో ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంతే కాకుండా లోగడ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియా సలహాదారుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ సరైన వ్యక్తి అని, ఆ పదవికి ఆయన ఎన్నికవుతారని మొట్టమొదట అంచనా వేసి, ఈ విషయాన్ని 2011లోనే జీవిఎల్ చెప్పారంటూ కమలం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.