ప్రధాని సోదరుడి కుమార్తె అయితేనేం..

13 October, 2019 - 3:07 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముసుగు దొంగలు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతుల్ని టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుమార్తె వ్యాలెట్‌ను కూడా ముసుగుదొంగలు లాక్కెళ్ళిపోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ చోరీ జరిగింది.

మోదీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోదీని కూడా ముసుగు దొంగలు దోచుకోవడం చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని ఇద్దరు ముసుగు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి తన వ్యాలెట్ లాక్కెళ్ళిపోయారంటూ దమయంతి బెన్ మోదీ శనివారంనాడు సివిల్ లైన్స్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దమయంతి బెన్ మోదీ ఫిర్యాదు మేరకు.. శనివారం ఉదయం ఆమె అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చారు. బస కోసం సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్‌లో గదిని బుక్ చేసుకున్నారు. గేటు వద్దకు వచ్చేసరికి ఇద్దరు ముసుగు దొంగలు బైక్‌పై వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కెళ్ళారు. ఆ వ్యాలెట్‌లో రూ.56 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం తాను విమానం ఎక్కాల్సి ఉందని, కానీ ముఖ్యమైన పత్రాలన్నీ ఆ వ్యాలెట్‌లోనే ఉండిపోయాయని దమయంతి బెన్ మోదీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేస్తున్నారు.